తొలి అడుగులోనే తెలివిని ప్రదర్శించిన రేవంత్!
ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకున్న విషయాన్ని అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించింది.
By: Tupaki Desk | 6 Dec 2023 7:26 AM GMTఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరమైతే.. 64 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు షురూ చేయటం తెలిసిందే. బొటాబొటిగా సీట్లు వచ్చే వేళ.. పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారన్న సమాచారంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తంగా ఉంది. అందుకే.. పార్టీకి చెందిన ముఖ్యుల్ని ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గం వద్ద ఉంచి.. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థుల్ని తమతో పాటు హైదరాబాద్ కు తీసుకొచ్చేశారు.
అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాని కంటే నాలుగు స్థానాలు అధికంగా ఉండటం.. గులాబీ పార్టీ 39 స్థానాల వద్దే ఆగిపోవటంతో.. ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకోలేదు. దీనికి తోడు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం పంచాయితీ జోరుగా ఉంటుందని.. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ రావాలంటూ తరచూ కేసీఆర్ చేసే విమర్శలకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా వెను వెంటనే సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాకుంటే.. ఉత్తమ్.. భట్టి.. కోమటిరెడ్డి పుణ్యమా అని రెండు రోజుల సాగదీత.. సీఎం ప్రకటనపై ఏర్పడింది. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకున్న విషయాన్ని అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించింది. ఇదంతా అందరికి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొంతసేపటికే గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు చేరుకున్న రేవంత్.. మంగళవారం రాత్రి అధిష్ఠానం ఢిల్లీకి రమ్మన్న వరకు హోటల్ లోనే ఉన్నారు. అక్కడ ఆయనేం చేశారు? అన్న దానిపై ఎలాంటి రిపోర్టులు రాలేదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎల్లా హోటల్ లో రేవంత్ వ్యవహరించిన తీరును చూసినోళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు వ్యతిరేకంగా సీనియర్లు ఢిల్లీకి వెళ్లటం.. మంతనాలు జరపటం లాంటివి చేస్తుంటే.. ఆయన మాత్రం అవేమీ పట్టనట్లుగా మంత్రివర్గ కూర్పుతో పాటు.. అధికారులతో మాట్లాడటం.. కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులతో గడపటం లాంటి పనులు చేసినట్లుగా చెబుతున్నారు. సీఎంరేసులో తాము కూడా ఉన్నామంటూ సీనియర్లు వారి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్న ఎజెండాను క్రమపద్దతిలో చేసుకుంటూ పోయినట్లు చెబుతున్నారు.
తొలి అడుగులోనే తన అధిక్యతను ప్రదర్శించిన రేవంత్ తీరు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీఎం కాకుండానే ముఖ్యమంత్రిగా ఆయన తీరు ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఏపీలోని తుపాను నేపథ్యంలో వర్షాలు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులకు ట్వీట్ సందేశాన్ని పంపిన తీరు.. అందులో ఉపయోగించిన భాషను చూస్తే.. ఒక ముఖ్యమంత్రి ఆదేశం తరహాలో ఉందంటున్నారు. మొత్తంగా ఎల్లా హోటల్ లో తాను ఉన్న రెండు రోజులు.. పూర్తిస్థాయిలో వినియోగించుకోవటమే కాదు.. పార్టీ మీద పట్టు సాధించినట్లుగా తెలుస్తోంది. రేవంత్ కు అధిష్ఠానం ఎంత ప్రయారిటీ ఇస్తుందన్న విషయాన్ని గుర్తించిన సీనియర్లు మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు.