కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి దూరం.. రీజనేంటి?
దీనిలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియకపోయినా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఏమైనా జరగొచ్చనే వాదన విననిపిస్తోంది.
By: Tupaki Desk | 31 May 2024 12:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదికి వచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటి ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి.. ఇప్పుడు ఆ పార్టీకిదూరంగా ఉంటున్నారు. కనీసం.. కలివిడిగా కూడా ఉండడం లేదనే వాదన వినిపిస్తోంది. పార్టీ నాయకులకు, పార్టీ వర్గాలకు కూడా ఆమె అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆమె పార్టీ నుంచి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియకపోయినా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఏమైనా జరగొచ్చనే వాదన విననిపిస్తోంది.
రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్ర హం, తెలంగాణ అధికారిక చిహ్నం.... తెలంగాణ జాతీయ గీతాలను కూడా అదే రోజు ఆవిష్కరించా లని నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్టీ అగ్రనాయకులు సహా... ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపించా రు. జూన్ 2న తప్పకుండా రావాలని కూడా పిలుపునిచ్చారు.
ఇదే ఆహ్వానాన్ని.. పార్టీ నేత విజయశాంతికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు పంపించింది. అయితే.. ఆమె దీనిని స్వీకరించలేదని సమాచారం. అంతేకాదు.. కీలకనేతలకు కూడా ఆమె అందుబాటులోకిరాలేదని తెలిసింది. అయితే.. పార్టీ కార్యాలయానికి ఆమె ఒక ఫ్యాక్స్ చేశారు.. తాను అందుబాటులో లేనని.. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం బాంబేలో ఉన్నానని ఆమె తెలిపారు. అందుకే తాను హాజరుకావడం లేదన్నారు.కానీ, ఈ విషయంలో మరో వాదన వినిపిస్తోంది.
తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కక పోవడం, ప్రభుత్వం ఏర్పడినా కూడా.. తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వక పోవడంతోనే విజయశాంతి ఇలా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారం వరకు కూడా విజయశాంతి అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అత్యంత కీలకమైన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కూడా ఆమె రానని చెప్పడం ద్వారాఅసలు పార్టీలో ఉంటారో ఉండరో అనే చర్చ జరుగుతోంది.