అమెరికా నుంచి తిరిగొస్తూ కొందరిని మంత్రులు చేయనున్న రేవంత్
ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 4 Aug 2024 7:39 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. మధ్యలో లోక్ సభ ఎన్నికలు.. సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ అది.. దేశ చరిత్రలో తొలి ఎన్నికలు తప్ప మరే ఎన్నికలూ ఇంత ఎక్కువ రోజులు జగరలేదు. కాగా, తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లు నెగ్గాయి. ఇక మిగిలింది క్యాబినెట్ విస్తరణ. అధికారం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 11 మందితో కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు. అయితే, ఇప్పటివరకు ఓకే గానీ.. మున్ముందు ఇలాగైతే కుదరదు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ఈ లెక్కన పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరాల్సిందే.
విస్తరణకు ముహూర్తం
ఈ శ్రావణ మాసం తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానుంది. మంత్రివర్గ విస్తరణకు అప్పుడే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 11 మంది ఉన్నారు. ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. ఒకటికి మించిన కీలకమైన శాఖలను మంత్రులు చూడాల్సి వస్తోంది. అత్యంత కీలకమైన హోం శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. ఆర్థికం, విద్యుత్తు వంటి రెండు ముఖ్య శాఖలను ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రజల్లోకి దూసుకెళ్లాలంటే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తోడు పాలనా పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలి. కాబట్టి పూర్తిస్థాయి మంత్రివర్గం ఉండాల్సిందే. అందుకే తక్షణం విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం.
నలుగురికి చాన్స్
సీఎం రేవంత్ ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన రెండు వారాలకు పైగా అక్కడే ఉంటారు. రాగానే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని చెబుతున్నారు. మంతరి వర్గంలో ఆరు ఖాళీలున్నా నలుగురినే తీసుకునే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మరి వచ్చే నలుగురు మంత్రులూ ఈ జిల్లాల వారు అయి ఉంటారా? లేక ఇతర జిల్లాలకు చెందినవారా? రాజధాని హైదరాబాద్ కు మంత్రి లేకపోవడం కాస్త విచిత్రమే అయినా పరిస్థితులు అలా చేశాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటునూ గెలవకపోవడంతో (ఉప ఎన్నికలో కంటోన్మెంట్ తప్ప) నేరుగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకపోయింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ వంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లోకి వచ్చినందున ఆయనను తీసుకుంటారో లేదో చూడాలి. నిజామాబాద్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి సామాజిక సమీకరణాలు అడ్డు వస్తున్నాయి. ఆదిలాబాద్, రంగారెడ్డిలో ఎవరికి చాన్స్ ఇస్తారనేది ఆసక్తికరం. మొత్తానికి రేవంత్ అమెరికా నుంచి తిరిగి వస్తూ వస్తూ కొత్త మంత్రులను తీసుకురానున్నట్లు స్పష్టం అవుతోంది.