Begin typing your search above and press return to search.

కేటీఆర్ చెప్పిన‌ట్లే చేస్తున్న రేవంత్‌!

పార్టీ ఉనికి ప్ర‌మాదంలో ప‌డ‌టంతో నిస్సహాయ స్థితిలో ఉన్న కేటీఆర్ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని కాంగ్రెస్‌పై నోరేసుకుని ప‌డిపోతున్నారు.

By:  Tupaki Desk   |   13 July 2024 3:00 AM GMT
కేటీఆర్ చెప్పిన‌ట్లే చేస్తున్న రేవంత్‌!
X

అవును.. ఇదే నిజం. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన‌ట్లే సీఎం రేవంత్ చేస్తున్నారు. కేటీఆర్ మాట‌ల‌ను నిజం చేస్తూ బీఆర్ఎస్‌ను దెబ్బ‌కొడుతున్నారు. అది ఎలా అంటారా? గ‌తేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఖాళీ చేసే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, హ‌రీష్ రావుకు ఎక్క‌డ‌లేని కోపం వ‌స్తోంది. పార్టీ ఉనికి ప్ర‌మాదంలో ప‌డ‌టంతో నిస్సహాయ స్థితిలో ఉన్న కేటీఆర్ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని కాంగ్రెస్‌పై నోరేసుకుని ప‌డిపోతున్నారు.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల‌పై పోరాటం చేస్తామ‌ని కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి గ‌తంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్నార‌ని ప్ర‌శ్నిస్తే కేటీఆర్ కొత్త స‌మాధానం చెప్పారు. తాము ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌లేద‌ని, ఆయా పార్టీల శాస‌న‌స‌భ ప‌క్షాల‌ను విలీనం చేసుకున్నామ‌ని కొత్త నిర్వ‌చనం చెప్పారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు దూకుడుగా సాగుతున్నారు.

ఫిరాయింపులు త‌ప్ప‌ని, విలీనం త‌ప్పు కాద‌ని చెప్పిన కేటీఆర్ మాట‌ల‌ను నిజం చేసేలా రేవంత్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. మ‌రో ఇద్ద‌రు లైన్లో ఉన్నారు. ఇంకో ఆరుగురు కూడా కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డం కాంగ్రెస్ ట‌ర్గెట్గా క‌నిపిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. ఆ త‌ర్వాత సీఎల్పీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం లాంఛ‌న‌మేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందే ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని రేవంత్ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రో 15 రోజుల్లో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం త‌థ్య‌మ‌ని కారు దిగి హ‌స్తం గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య‌లు అందుకు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.