కేసీఅర్ చెప్పింది రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నారా ?
ఆ విధంగా చూస్తే అధినాయకత్వం తో చర్చలు జరపడానికి సీఎం వెళ్లడాన్ని ఎవరూ తప్పుపట్టరు.
By: Tupaki Desk | 4 July 2024 2:44 PM GMTగతంలో కేసీఆర్ అన్నదే ఇపుడు నిజం అవుతోందా. రేవంత్ రెడ్డి కేసీఆర్ మాటలనే వాస్తవం చేస్తున్నారా. రేవంత్ రెడ్డి తెలంగాణా సీఎం. ఆయన పార్టీ కాంగ్రెస్. దాని అధినాయకత్వం ఢిల్లీలో ఉంది. ఆ విధంగా చూస్తే అధినాయకత్వం తో చర్చలు జరపడానికి సీఎం వెళ్లడాన్ని ఎవరూ తప్పుపట్టరు.
కానీ అది శృతి మించిపోయింది రేవంత్ రెడ్డి విషయంలో అని అంటున్నారు. ఆయన అధికారం చేపట్టి జూలై మొదటి వారానికి అచ్చంగా ఏడు నెలలు అవుతోంది. ఈ ఏడు నెలలలో రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్లారో విపక్షం లెక్కతో సహా వివరించి చెబుతోంది. ఒక విధంగా ఆయనను ఢిల్లీ సీఎం అని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఎందుకు అన్నారో కూడా గుర్తు చేస్తోంది
బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణాలోనే సీఎం ఉంటారని అదే కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఢిల్లీలో ఉంటారని ఢిల్లీ వారే రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతారు అని కేసీఆర్ పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఒక విధంగా తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని తట్టిలేపడానికే కేసీఅర్ ఈ పదజాలాన్ని అప్పట్లో ఉపయోగించారు. అయితే ఇపుడు సరిగ్గా రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు అని అంటున్నారు.
అదెలా అంటే ఆయన సీఎం అయిన ఏడు నెలల కాలంలో ఏకంగా పదుల సంఖ్యలోనే వెళ్లారని అంటున్నారు. ఈ విషయంలో ఆయన రికార్డుని బద్ధలు కొట్టారు అని అంటున్నారు. తెలంగాణాలో మూడు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని సార్లు ఢిల్లీకి వెళ్ళడం అవసరమా అని చర్చ సాగుతోంది. ఎంత హై కమాండ్ ఢిల్లీలో ఉన్న ప్రతీ చిన్న విషయానికి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.
రేవంత్ రెడ్డి తో పాటుగానే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సీఎం గా సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన అవసరం అయినప్పుడే ఢిల్లీకి వెళ్తున్నారు. మిగిలిన సమయం అంతా తన పని తాను చేసుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి అధినాయకత్వం మెప్పు కోసమే ఢిల్లీ పదే పదే వెళ్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. అదే టైంలో ఢిల్లీ పెద్దలను మంచి చేసుకుంటే తన సీఎం పదవి పది కాలల పాటు పదిలంగా ఉంటుందని భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే ప్రతీ విషయాన్ని స్థానికంగా ఉన్న ప్రజలు గమనిస్తున్నారు అన్నది రేవంత్ రెడ్డి మరచిపోతున్నారు అని అంటున్నారు. పార్టీల వరకూ చూస్తే హై కమాండ్ ఢిల్లీలో ఉంటే ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో అసలైన
హై కమాండ్ ప్రజలు అన్న సంగతిని గుర్తించాలని అంటున్నారు.అలా కాకుండా కేవలం తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అధినాయకత్వంతో భేటీల మీద భేటీలు వేస్తే రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే తెలంగాణాను పాలించేది రేవంత్ రెడ్డి కాదు ఢిల్లీ పెద్దలే అన్నది జనంలో బలపడితే అది కాంగ్రెస్ కి కూడా డ్యామేజ్ చేసేదిగా మారుతుంది అని అంటున్నారు. పీసీసీ కొత్త చీఫ్ ని నియమించడం కోసం చర్చలు అని అంటున్నారు. అలాగే ఆరుగురు కొత్త మంత్రులను తీసుకోవాలన్న దాని మీద ఎన్ని సార్లు చర్చిస్తారు అన్నది కూడా రాజకీయ వర్గాలలో డిస్కషన్ గా ఉంది.
పాలన చేయాల్సిన సీఎం ఉండాల్సింది సచివాలయంలో కదా అని అంటున్నారు. అలా సీఎం సెక్రటేరియట్ కి వెళ్లడం లేదు, మంత్రులు ప్రజలలోకి వెళ్లడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విధంగా కనుక ఢిల్లీ టూర్ పెట్టుకుంటూ ఉంటే కేరాఫ్ ఢిల్లీగానే రేవంత్ రెడ్డి మారిపోతారని అది బీఆర్ ఎస్ భారీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుందని అంటున్నారు. ఆ మీదట ఏమి చేసినా ఇబ్బందిని కోరి తెచ్చుకోవడమే అవుతుంది అని అంటున్నారు.
కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలకు రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ఉంది అన్నది కనుక జనంలోకి వెళ్తే డేంజర్ సిగ్నల్ గానే ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు కేసీఆర్ ఇలాంటి వాటిని తీసుకుని జనంలోకి భావోద్వేగం కలిగించే ప్రయత్నం తప్పకుండా చేసి తీరుతారు అని అంటున్నారు. సో రేవంత్ ఢిల్లీ టూర్లకు కాస్తా గ్యాప్ ఇస్తూంటే మంచిదన్న సూచనలు వస్తున్నాయి.