Begin typing your search above and press return to search.

నీట్ లీకేజీపై మైలేజీని వదులుకుంటున్నసీఎం రేవంత్

నీట్ ను తొలినుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది తమిళనాడు. ఆ రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా ఇదే విధానం అవలంబిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 10:11 AM GMT
నీట్ లీకేజీపై మైలేజీని వదులుకుంటున్నసీఎం రేవంత్
X

దాదాపు నెల రోజులుగా నీట్ పరీక్షపై జాతీయ స్థాయిలో రగడ జరుగుతోంది.. వైద్య విద్య ప్రవేశాలకు ఉద్దేశించిన ఈ పరీక్ష ఫలితాలను ఎన్నడూ లేనిది షెడ్యూల్ తేదీ కంటే ముందుగానే విడుదల చేయడం.. అదికూడా ఎన్నికల ఫలితాల రోజు (జూన్ 4)నే విడుదల చేయడంతో అనేక అనుమానాలు వచ్చాయి. దీనికితగ్గట్లే నీట్ పై రోజుకో ఆరోపణ. రోజుకో కొత్త విషయం బయటకు వస్తున్నాయి. ప్రధాని మోదీ మూడో విడత పాలన తొలి రోజుల్లోనే నీట్ లాంటి ఉదంతం చోటుచేసుకుంది. అందులోనూ కేంద్రంలో ఇండియా కూటమి ప్రతిపక్షం బలంగా ఉండగా..

సీఎం సార్ గళమెత్తండి

నీట్ ను తొలినుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది తమిళనాడు. ఆ రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా ఇదే విధానం అవలంబిస్తున్నారు. ప్రస్తుత స్టాలిన్ ప్రభుత్వం అయితే మరీనూ..? అనేక రాష్ట్రాల్లో నీట్ గురించి భయాందోళనలు ఉన్నాయి. ఇక తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. జాతీయ స్థాయిలో నీట్ లీకేజీపై కాంగ్రెస్ అగ్ర నేతలు అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ గట్టిగా ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా స్పందించలేదు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ ఆందోళనలు చేపట్టింది.

ప్రెస్ మీట్ పెట్టి కడిగేస్తే..

వర్తమాన వ్యవహారాలపై చాలా స్పష్టమైన అవగాహనతో ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీట్ పై ప్రెస్ మీట్ పెట్టి పరీక్ష అవకతవకలను కడిగేసి ఉంటే మంచి మైలేజీ వచ్చేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకనో ఆయన మాత్రం దీనిపై ఫోకస్ పెట్టలేదు. జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదం అవుతున్న అంశాన్ని అందిపుచ్చకుని ప్రజల్లో మరింత ఆదరణ చూరగొనే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారా? అనిపిస్తోంది. మరోవైపు నీట్ లో అవకతవకలపై విచారణకు సీబీఐని ఆదేశించారు. అంటే.. ఇందులో ఎంతోకొంత వివాదం ఉందనే తెలుస్తోంది. మరి ఇప్పటికైనా రేవంత్ నీట్ పై తన నోటితో కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేస్తారా?