అవి ఇసుక గూళ్లు.. కేసీఆర్ మనవళ్లకు కట్టించిండు!
తాజాగా అన్నారం కుంగుబాటుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. "అవి ఇసుక గూళ్లు..కేసీఆర్ తన మనవళ్లు ఆడుకునేటందుకు కట్టించిండు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
By: Tupaki Desk | 2 Nov 2023 1:30 AM GMTతెలంగాణలో బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హయాంలో కట్టించిన కొన్ని ప్రాజెక్టులు కుంగుతున్న నేపథ్యంలో ఆయనపైనా.. పార్టీపైనా విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. మేడిగడ్డ కుంగుబాటుపై ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఇక, తాజాగా అన్నారం ఘటన కూడా బీఆర్ ఎస్‌కు ఇబ్బందిగా మారింది. ఆయా ప్రాజెక్టుల కుంగుబాటుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రాజెక్టుల కుంగుబాటు.. అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.
తాజాగా అన్నారం కుంగుబాటుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. "అవి ఇసుక గూళ్లు..కేసీఆర్ తన మనవళ్లు ఆడుకునేటందుకు కట్టించిండు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్.. ప్రాజెక్టులపై విమర్శల వర్షం కురిపించారు. 'కల్వకుంట్ల స్కామేశ్వరం'- అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించారు.
"కల్వకుంట్ల 'స్కామేశ్వరం'లో మరో మైలు రాయి. నిన్న మేడిగడ్డ, నేడు అన్నారం ఘటనలు. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు. ప్రాజెక్టు అంటే నీ ఫామ్‌హౌజ్‌కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగుకోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు" అని రేవంత్ విమర్శించారు.
వందేళ్లకు పైగా ఉండాల్సిన ప్రాజెక్టులు, ఇలా కళ్లముందే కొట్టుకుపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు కావా..? అని నిలదీశారు. ఈ ప్రాజెక్ట్‌లో రూ. లక్ష కోట్ల అవినీతి జరగలేదని నిరూపిస్తావా.. కేసీఆర్... అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై మంత్రి కేటీఆర్ కానీ, ఎమ్మెల్సీ కవిత కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.