Begin typing your search above and press return to search.

పవన్ జనసేనపైన ఫస్ట్ టైం రేవంత్ అలా...!

ఇక ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తెలంగాణాలో బీజేపీతో పొత్తులతో పోటీకి దిగడం మీద కూడా విమర్శలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:37 PM GMT
పవన్ జనసేనపైన ఫస్ట్ టైం రేవంత్ అలా...!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికలలో మొదటిసారి పోటీ చేస్తున్నారు. నిజానికి ఆయన పోటీ చేస్తాను అని చాలా ముందుగానే ప్రకటించారు. 32 సీట్లలో తమ పార్టీ పోటీ పడుతుందని కూడా ఎన్నికల నోటిఫికేషన్ రావడం కంటే ముందుగానే వెల్లడించారు. ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

చివరికి పవన్ పార్టీ బీజేపీతో కలసి పొత్తు పెట్టుకుంది. పోటీలోకి దిగింది. అయితే పవన్ ఎందుకు ఇలా చేశారు అన్నది ఒక చర్చగా ఉంది. అసలు తెలంగాణాలో పోటీ వల్ల పవన్ కి కలసి వచ్చేది ఏమిటి అన్నది కూడా అందరిలోనూ ప్రశ్నలు లేవనెత్తింది. పవన్ కళ్యాణ్ ఈసారికి ఏపీ వరకూ ఫోకస్ పెడితే బాగుండేది అన్న సూచనలు వచ్చాయి.

ఇక ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తెలంగాణాలో బీజేపీతో పొత్తులతో పోటీకి దిగడం మీద కూడా విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీని ఎన్డీయేను ఇంకా వీడలేదు పైగా ప్రధానిగా మోడీ ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. దాంతో ఆయన బీజేపీ పెద్దలతో భేటీ అయిన మీదట పొత్తు కలిపి పోటీకి దిగారు అని అంటారు.

ఇక జనసేనకు ఎనిమిది సీట్లు బీజేపీ ఇచ్చింది. బీ ఫారాలు కూడా పవన్ అందచేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది. పవన్ ఎన్నికల్లో ప్రచారం అయితే చేయడంలేదు. కానీ పోటీలో జనసేన ఉంది. దాంతో ఒకవేళ జనసేనకు తక్కువ ఓట్లు వచ్చినా డిపాజిట్లు గల్లంతు అయినా ఆ ప్రభావం ఏపీ మీద ఉంటుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

అయితే పవన్ అంత దూరం ఆలోచించారా అన్నదే ఇక్కడ పాయింట్. అయితే పవన్ బీజేపీని ఏపీలో తమ కూటమితో పొత్తులకు సుముఖం చేసే ఉద్దేశ్యంతో కూడా తెలంగాణాలో పొత్తు కలిపి ఉంటారని అంటున్న వారూ లేకపోలేదు. అయితే పవన్ వ్యూహం ఏమైనప్పటికీ అది ఏపీలో జనసేన మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అంతా అంటున్నారు.

ఇపుడు అదే మాటను తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేస్తున్న సీట్లలో ఓట్లు తక్కువగా వస్తే ఆ ప్రభావం ఏపీ మీద ఉంటుందని ఏపీ రాజకీయాల్లో జనసేన మీద ఉంటుందని కీలక కామెంట్స్ చేశారు.

ఒక చానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జనసేన బీజేపీతో కలసి తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయడం తప్పు అన్నట్లుగా మాట్లాడారు. మరి దీని మీద జనసేన ఏమనుకుంటుందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.

సరిగ్గా ఇదే పాయింట్ దగ్గరే టీడీపీ కూడా పోటీ చేయకుండా ఆగిపోయింది. ఆ పార్టీకి 2018 నాటి చేదు అనుభవం కూడా ఉంది. 2014లో అయితే రెండు ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. అప్పటికి తెలంగాణా టీడీపీ బలంగా ఉంది కాబట్టి సరిపోయింది. 2018 నాటికి సీన్ అలా లేదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు పోటీకి సై అని అన్నారు. తెలంగాణాలో బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. అది ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపి టీడీపీ ఓటమి పాలు అయింది.

దాంతో 2023 ఎన్నికల్లో పోటీ వద్దు అని బాబు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. జనసేన టీడీపీ మిత్రపక్షంగా ఏపీలో ఉంటూ కూడా బాబు బాటలో ఎందుకు నడవలేదు అన్నదే చర్చగా ఉంది. మరి చంద్రబాబు కంటే భిన్నంగా పవన్ ఎందుకు ఆలోచించారు, ఆయన వ్యూహాలేంటి అన్నది పక్కన పెడితే మాత్రం తెలంగాణాలో హోరా హోరీ పోరులో మాత్రం జనసేన ఇబ్బంది పడితే తక్కువ ఓట్లు వస్తే ఏపీ రాజకీయాల్లోనే చాలా ప్రభావం ఉంటుంది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు.