శుక్రవారం నుంచి.. మళ్లీ ప్రజల్లోకి రేవంత్ లోక్ సభ 'గంట' కొట్టారే!
వచ్చే రెండు రోజుల్లో అంటే.. శుక్రవారం నుంచి ఆయన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
By: Tupaki Desk | 30 Jan 2024 4:08 PM GMTతెలంగాణ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పక్కా వ్యూహంతో రెడీ అయ్యారు. వచ్చే రెండు రోజుల్లో అంటే.. శుక్రవారం నుంచి ఆయన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తాజాగా పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన కీలక సమావేశంలో రేవంత్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.
"లోక్‌సభ ఎన్నికలకు 60 నుంచి 65 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇది చాలా తక్కువ సమయం. సో.. అందరూ అలెర్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరిం చాలి. " అని రేవంత్ పిలుపునిచ్చారు. ఇక, సీఎం హోదాను పక్కన పెట్టి.. మాస్ లీడర్‌గా తాను కూడా ప్రజల్లోకి రానున్నట్టు రేవంత్ చెప్పారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా తిరిగిన రేవంత్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చి పెట్టారు.
ఇదే పంథాలో ఆయన ముందుకు సాగాలని.. వచ్చే ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలకు కనీసంలో కనీసం 12-14 దక్కించుకుంటే.. కేంద్రంలోనూ తమ పరపతి పెరుగుతుందని.. ముఖ్యంగా రాహుల్‌గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి ప్రజాబాట పట్టనున్నారు. ఈ సారి ప్రచారంలో ప్రభుత్వం పక్షాన అమలు చేస్తున్న వివిధ పథకాలే ప్రధాన వనరులుగా ఉన్నాయని సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసిన రేవంత్ మాస్‌లో గుర్తింపు పొందారు. కానీ, ఇప్పుడు టార్గెట్ అంతా కూడా.. పథకాలు, కేంద్రంలోని మోడీ సర్కారు వంటివేనని తెలుస్తోంది. లేనిపోని విమర్శలకు దిగకుండా.. పక్కా ప్లాన్ తో రేవంత్‌రెడ్డి ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు.
తొలి సభ ఎక్కడంటే..
వచ్చే నెల 2 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి తొలిసభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించనున్నారు. ఈ వేదికగానే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ శంఖాన్నిఆయన పూరించనున్నారు. కాగా,.. అభ్యర్థుల ఎంపిక మాత్రం ఈ దఫా రేవంత్‌కు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన చాలా వ్యూహాత్మకంగా తనకు సంబంధం లేదని.. అధిష్టానం నిర్ణయమే కీలకమని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, పార్టీ ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించిన విషయం తెలిసిందే.