రీల్ కు మించిన ట్విస్టులు.. రేవంత్ రియల్ లవ్ స్టోరీ!
ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సొంతంగా.. తనకున్న పట్టుదల.. కసితో ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2023 4:10 AM GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు రేవంత్ రెడ్డి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సొంతంగా.. తనకున్న పట్టుదల.. కసితో ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత మేధావిగా.. తన ఎత్తులతో ఎంతటి వారిని అయినా సరే ఒక ఆట ఆడుకునే సత్తా ఉందని భావించే గులాబీ బాస్ కేసీఆర్ ను ఓటమిపాలు చేసి.. ఆయన చేతిలో ఉన్న రాజదండాన్ని.. ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకొని.. దర్జాగా దాని మీద కూర్చోవటానికి సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం ఒక స్ఫూర్తివంతంగా కనిపించటం ఒక ఎత్తు అయితే.. యంగ్ ఏజ్ లో ఆయన లవ్ స్టోరీ సినిమా కథను తలపించేలా ఉంటుంది. అందులోని ట్విస్టులు చూస్తే.. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోనిదిగా ఉంటుందని చెప్పాలి. చిన్నతనం నుంచి విద్యార్థి నాయకుడిగా చురుగ్గా వ్యవహరించిన రేవంత్..తన కెరీర్ ను ఒక చిన్న పత్రికలో పని చేయటం ద్వారా షురూ చేశారు. తర్వాతి కాలంలో రియల్ ఎస్టేట్ తో పాటు మరిన్ని వ్యాపారాలు చేశారు.
ఏం చేసినా.. రాజకీయాలంటే విపరీతమైన ఆసక్తి రేవంత్కు. స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా.. ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆయన.. టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం సాయంత్రం వేళలో ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వ ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. దీంతో.. ఆయన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని ఫైనల్ చేసినట్లైంది.
రేవంత్ పొలిటికల్ లైఫ్ గురించి అందరికి తెలిసినా.. ఆయన వ్యక్తిగత జీవితం అందునా.. ఆయన లవ్ స్టోరీ తక్కువ మందికే తెలుసు. ఇంటర్ చదువుకునే వేళలో జైపాల్ రెడ్డి సమీప బంధువు అయిన గీతారెడ్డిని రేవంత్ ఒక పెళ్లిలో చూశారు. ఆమె మీద మనసు పడ్డారు. మొదట స్నేహంగా మొదలైన వారి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. గీతారెడ్డికి రేవంతే ప్రపోజ్ చేశారు. రేవంత్ తీరు.. ముక్కుసూటితనం.. విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే తీరు నచ్చిన ఆమె పెళ్లిక ఓకే చేశారు.
కాకుంటే.. అప్పటికే గీతారెడ్డి కుటుంబం సంపన్న కుటుంబం. అందుకు భిన్నం రేవంత్ ఫ్యామిలీ. దీంతో.. ఆస్తుల తేడా వారి పెళ్లికి అడ్డంకిగా మారింది. దీనికి తోడు.. అప్పటికి రేవంత్ సరిగా సెటిల్ కాకపోవటంతో.. గీతారెడ్డిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో ఆమె కుటుంబం సుముఖత వ్యక్తం చేయలేదు. వీరి పెళ్లికి ఇష్టం లేని గీతారెడ్డి తల్లిదండ్రులు ఆమె ఉన్నత చదువుల కోసం..రేవంత్ కు దూరంగా ఉంచుదామన్న ఉద్దేశంతో తమ సోదరుడైన అప్పటి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపారు.
ఢిల్లీ వెళ్లిపోవటంతో రేవంత్ నిరాశ పడ్డారు. అయినా.. వెనక్కి తగ్గలేదు. ఆమెను పెళ్లి చేసుకునే విషయంలో.. గీతారెడ్డి ఇంట్లో ఉన్న అభ్యంతరాల్ని అధిగమించి.. వారందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహబంధం 1992లో మొదలైంది. అయితే.. రేవంత్ లవ్ స్టోరీలో మరో మలుపు ఉందని చెబుతారు. తొలుత ఇంట్లో వారికి తెలీకుండా పెళ్లి చేసుకున్న రేవంత్..తర్వాత పెద్దల్ని ఒప్పించటంలో సక్సెస్ అయ్యారని చెబుతారు. పెళ్లి తర్వాత.. రేవంత్ మైండ్ సెట్ ను అర్థం చేసుకున్న గీతారెడ్డి ఇంట్లో అతడికి ఎంతో మర్యాద ఇచ్చేవారని చెబుతారు. ఇక.. రేవంత్ అత్తగారు అయితే.. అల్లుడ్ని ప్రాణంగా చూసుకునేవారని.. అతడి వ్యక్తిత్వాన్ని ఆమె గొప్పగా చెప్పుకునే వారని చెబుతారు.