రేవంత్ పై కారాలు, మిరియాలు నూరుతున్న కాంగ్రెస్ నేతలు!
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొందరికి ఇష్టం లేదనేది బహిరంగ రహస్యమే
By: Tupaki Desk | 28 Sep 2023 8:40 AM GMTతెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టాక ఆ పార్టీ దశ, దిశ మారిపోయాయనే అంచనాలు ఉన్నాయి. అప్పటివరకు బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న పోటీని రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మార్చేశారు. దూకుడైన విమర్శలతో అధికార బీఆర్‌ఎస్ ను.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు.
మాస్ లీడర్ గా, మంచి వాగ్ధాటి ఉన్న నేతగా రేవంత్ రెడ్డికి ఉన్న గుర్తింపుతో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. భారీ ఎత్తున బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలు జరిగాయి. అయితే రేవంత్ రెడ్డిపై మొదట నుంచి సొంత పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు కారాలు మిరియాలు నూరుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో ఆ సీనియర్ నేతలు రేవంత్ కు సమస్యలు సృష్టిస్తున్నారని అంటున్నారు.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొందరికి ఇష్టం లేదనేది బహిరంగ రహస్యమే. ఇలాంటి నేతల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వీహెచ్ హనుమంతరావు, తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ నేతల కంటే కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. అయినా రేవంత్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగారు. పార్టీ అధిష్టానం అసంతృప్త నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి మొదట్లో సద్దుమణిగింది.
మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణాన టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక అంతా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారని, ఆయన మాటే చెల్లుబాటు అవుతోందని కొందరు సీనియర్లు గుస్సా అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తమతో సంప్రదించాలని, తమకు ఓ మాట చెప్పాలని వారంతా అంతర్గత సంభాషణల్లోనూ, మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారట.
తాజాగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఆయన అరెస్టును ఖండిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను కూడా ఈ సీనియర్ నేతలు తప్పుబడుతున్నారని సమాచారం. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని.. దీన్ని కేసీఆర్ రాజకీయంగా వాడుకుని, మళ్లీ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. రేవంత్ రెడ్డి అంటే మొదటి నుంచి కంటగింపు ఉన్నవారే ఆయనను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల ముందు పార్టీని దెబ్బతీసేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు.