నువ్వో కచరా.. నన్ను 'రేటెంతరెడ్డి' అంటావా?: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
By: Tupaki Desk | 30 Oct 2023 4:47 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన కాంగ్రెస్‌పై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గకుండా కౌంటర్లు ఇస్తోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్.. ఇటీవల కాలంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అమ్ముడు పోయే నాయకుడు అనే అర్థంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ''ఆయన రేవంత్‌రెడ్డి కాదు. రేటెంతరెడ్డి'' అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి అంతే దూకుడుగా ఎదురు దాడి చేశారు. ''కేటీఆర్ ఓ కచరా! నన్ను రేటెంతరెడ్డి అంటాడా? నన్ను కొనేటోడు ఇంకా పుట్టలే'' అని వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర మెదక్ పట్టణంలో సాగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి మల్కాజిగిరి ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. మైనంపల్లి రోహిత్‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్ పేద ప్రజలకు సేవ చేస్తారు'' అని అన్నారు
ఇదేసమయంలో కేసీఆర్ సర్కారుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. అందుకే తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేసమయంలో నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా అని కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు.