Begin typing your search above and press return to search.

మిత్రుడ్ని మోసం చేసిన కేసీఆర్.. కొత్త ముచ్చట చెప్పిన రేవంత్

తాజాగా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన రేవంత్ కొత్త ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చారు

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:03 AM GMT
మిత్రుడ్ని మోసం చేసిన కేసీఆర్.. కొత్త ముచ్చట చెప్పిన రేవంత్
X

రాజకీయాల్లో టైమ్లీగా రియాక్టు కావటానికి మించింది మరొకటి ఉండదు. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా మాటలతో తన రాజకీయ ప్రత్యర్థిని బండకేసినట్లుగా బాదేస్తున్న ఫైర్ బ్రాండ్ కమ్ టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తాజాగా చెలరేగిపోయారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరును సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కొత్త ఉదాహరణ చెప్పటం ద్వారా.. ఔరా అనుకునేలా చేశారు.

తాజాగా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన రేవంత్ కొత్త ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చారు. నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని.. కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తున్నట్లుగా పేర్కొన్న రేవంత్.. ‘‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. కేసీఆర్ లు స్నేహితులు అని చెబుతుంటారు.మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్ కు మీరు ఒక లెక్కా? మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే.. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు’’ అంటూ ఫైర్ అయ్యారు.

సూటిగా.. సుత్తి కొట్టకుండా విషయాన్ని మనసుల్లోకి దించేలా మాట్లాడుతున్న రేవంత్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉంటాయన్న విషయం అర్థమయ్యేలా ఉండటం గమనార్హం. నర్సాపూర్ ను సిరిసిల్ల జోన్ తోకలిపి నిరుద్యోగుల్ని మోసం చేశారన్న రేవంత్.. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని చార్మినార్ జోన్ లో పరిశీలించే అవకాశాన్నిపరిశీలిస్తామని పేర్కొన్నారు. నర్సాపూర్ గడ్డ.. లంబాడీల అడ్డ అని తాము అధికారంలోకి వస్తే తండాల డెవలప్ మెంట్ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.

కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయని.. వాళ్లు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారని.. రైతుల ఆత్మహత్యల్లోనూ.. బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ గా కేసీఆర్ చేసిండంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం తాను ప్రచారం చేస్తే.. తనపై కేసులు పెట్టారని.. ఆమెను మాత్రం పార్టీలో చేర్చుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. సునీతా లక్ష్మారెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలన్న రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి.. ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.