రేవంత్ మరో సంచలన నిర్ణయం!
ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చి తన పాలన ప్రజాపక్షమని రేవంత్ నిరూపించారు
By: Tupaki Desk | 2 Jan 2024 7:38 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన శైలితో ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లూ ఆయన దూకుడుగా మాట్లాడతారని పేరు తెచ్చుకోగా ఇప్పుడు పాలనాపరమైన నిర్ణయాల్లోనూ ఆ దూకుడును కనబరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చి తన పాలన ప్రజాపక్షమని రేవంత్ నిరూపించారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులే కాకుండా మంత్రులు, ఇతర పార్టీల నేతలకు కూడా కొన్నిసార్లు ప్రవేశం ఉండేది కాదు. దాన్ని రేవంత్ బద్దలు కొట్టారు. ప్రజా భవన్ కు అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలిరోజే తొలగించి ప్రజలెవరైనా అక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించారు. తద్వారా ప్రజల ముఖ్యమంత్రిగా మరో అడుగు ముందుకేశారు. అంతేకాకుండా ప్రజా భవన్‌కు ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే’ ప్రజా భవన్‌గా నామకరణం చేయనున్నారు.
పరిపాలనలో తన ఒరవడిని కొనసాగిస్తూ సీఎం కాన్వాయ్ బయట ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ ను నిలపొద్దని ఆదేశాలు జారీ చేసి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా వీఐపీ సంస్కృతికి తాను వ్యతిరేకమని చాటి చెప్పారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా మీడియా పాత్రను గుర్తించి పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వంద రోజుల్లోగా పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. తద్వారా జర్నలిస్టులను చులకనగా చూడటం, అవమానించడం, అవహేళన చేయడం వంటి పనులు చేసిన గత సీఎం కేసీఆర్ కు, తనకు హస్తిమశకాంతరం తేడా ఉందని నిరూపించారు.
అదేవిధంగా పరిపాలనను వికేంద్రీకరిస్తూ ఎక్కడకక్కడ స్థానికంగా ప్రజా పాలన సభలకు శ్రీకారం చుట్టారు. అలాగే రాగద్వేషాలకు అతీతంగా ఉన్నత పదవుల్లో సమర్థులైనవారిని నియమించారు. సిఫారసులను పక్కనపెట్టారు.
ఇక ఇప్పుడు రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. పరిపాలనలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ ను ఆయన ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఇందులో తెలంగాణలో వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఉంటారని చెబుతున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ కోదండరాం వంటివారితోపాటు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆకునూరి మురళి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వంటివారికి అడ్వైజరీ కౌన్సిల్ లో చోటు కల్పిస్తారని పేర్కొంటున్నారు.
తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ పరిపాలనలో ముఖ్యమంత్రికి సలహాలిస్తుంది. అలాగే పాలనాపరంగా సరిదిద్దుకోవాల్సిన విషయాలను సూచిస్తుంది. ఈ కౌన్సిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అధ్యక్షుడిగా ఉంటారని సమాచారం. తన పరిపాలన మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటానికి రేవంత్ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి సలహా మండలి సభ్యులు కీలక సిఫార్సులు చేయనున్నారు. ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం మండల స్థాయిలో గురుకులాలు ఏర్పాటు చేయనుంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. వీటిని తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ సలహా పర్యవేక్షిస్తుంది.
తన నిర్ణయాల ద్వారా ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, మేధావులు, నిపుణులు, సామాన్య ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు ఆయన తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.