ఏపీలో భూముల ధరలపై రేవంత్ మాటలకు అమరావతి ఆన్సర్ ఇస్తుందా?
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అన్ని రంగాలతో పాటు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Sep 2024 11:48 AM GMTదేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అన్ని రంగాలతో పాటు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారత్ లోని టాప్-10 రిచ్చేస్ట్ సిటీస్ జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర అత్యంత కీలకంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధానంగా హైదరాబాద్ లో భూముల విలువ తారాస్థాయికి చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా హైదరాబాద్ నగరంలో జనాభా రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో పాటు ఐటీ కంపెనీలూ పెరుగుతుండటంతో.. నగరం విస్తరిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ ఆప్షన్ అనే మాటలు వినిపిస్తుంటాయి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏపీకి తెలంగాణను కంపేర్ చేశారు.
అవును... హైదరాబాద్ లోని శిల కళావేదికలో తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ (ఎం.ఎస్.ఎం.ఈ.) - 2024ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఎం.ఎస్.ఎం.ఈ. ల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే... గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. అయితే తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి, సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైందని అన్నారు. ఫలితంగా... తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దీంతో... ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సమయంలో... 2014-19 మధ్యకాలంలో అమరావతిలో భూమి ధరల విషయం తెరపైకి వచ్చింది. గతంలో అమరావతిలోనూ రియల్ ఎస్టేట్ బూమ్ భారీగా ఉండేదని గుర్తుచేస్తున్నారు పలువురు. ఇదే సమయంలో... ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో అమరావతికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు.
ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు... అమరావతిలో భూముల ధరల గ్రాఫ్ పైకి చూడటం మొదలుపెట్టిందని.. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే ఇది ప్రారంభమైనప్పటికీ.. ఇటీవల వరల్డ్ బ్యాంక్ లోన్ విషయం తెరపైకి రావడంతో ధరలకు రెక్కలు వస్తున్నాయని అంటున్నారు! మరి ఏపీలో భూముల ధరలపై రేవంత్ వ్యాఖ్యలకు అమరావతి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందనేది వేచి చూడాలి!