కవితకు బెయిల్ పై వ్యాఖ్యలు.. సుప్రీంకు రేవంత్ విచారం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు సమయంలో చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By: Tupaki Desk | 30 Aug 2024 6:24 AM GMTబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు సమయంలో చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన వ్యాఖ్యలు చినికిచినికి గాలివానగా మారడం.. సుప్రీం కోర్టు ఆ వ్యాఖ్యలు సరికావని తప్పుబట్టడంతో రేవంత్ విచారం వ్యక్తం చేశారు. గురువారం విచారణ సమయంలో సుప్రీం.. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి? అని అనడం.. మేం నేతలను సంప్రదించి తీర్పులిస్తామా? అని నిలదీసిన సంగతి తెలిసిందే. మంగళవారం కవితకు బెయిల్ రాగా.. బీఆర్ఎస్-బీజేపీ ఒప్పందంలో భాగంగానే ఆమెకు బెయిల్ వచ్చిందనే అర్థంలో రేవంత్ మాట్లాడడం సంచలనం రేపింది. దీంతో కవితకు బెయిల్ ఇచ్చిన ధర్మాసనంలోని న్యాయమూర్తులు
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘సీఎం ప్రకటనలను మీడియాలో చూశాం. బాధ్యతాయుత ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? పార్టీలను సంప్రదించో.. లేక రాజకీయ అంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?’ అంటూ గట్టిగా ప్రశ్నించారు.
ఓటుకు నోటు ప్రస్తావన తెస్తూ..
రేవంత్ రాజ్యాంగ పదవిలో ఉన్న సంగతిని గుర్తచేసిన సుప్రీం ధర్మాసనం.. రాజకీయాల్లోకి తమను లాగడంపై అసహనం వ్యక్తం చేసింది. సంస్థల పట్ల పరస్పర గౌరవంగా వ్యవహరించాలని సూచిస్తూనే.. ముఖ్యమంత్రి తీరు ఇలా ఉంటే ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ చేయాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. కాగా, 2015 నాటి ఓటుకు నోటు కేసులో రేవంత్ పై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.
స్పందించిన సీఎం..
తన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై అత్యంత విశ్వాసం ఉందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారని.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల అపార గౌరవం, విశ్వాసం ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసిస్తానని న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా ఎప్పటికీ భావిస్తూనే ఉంటానని ప్రకటించారు. దీంతో వివాదానికి ముగింపు పలికారు.