Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలున్నా వదలొద్దు..సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

డ్రగ్స్ వినియోగంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. సినీ తారలు.. సెలబ్రిటీలు.. పెద్ద స్థానాల్లో ఉన్న వారు ఎవరైనా సరే.. వారిని విడిచి పెట్టొద్దని.. డ్రగ్స్ మాట ఎత్తాలంటే భయపడేలా చేయాలని.. వాటి మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   26 May 2024 5:00 AM GMT
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలున్నా వదలొద్దు..సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్
X

అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్య వేగాన్ని ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల కోడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఫోకస్ మొత్తాన్ని రాజకీయాలకే కేటాయించారు. పాలనా సంబంధమైన అంశాలకు నామమాత్రం ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై సీరియస్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ తీరును ఆయన సమర్థించుకునే వారు కూడా. తాను ఎన్నికల సమయంలో ఇలానే వ్యవహరిస్తారనని కుండ బద్ధలు కొట్టారు. దీనికి తగ్గట్లే ఆయన తీరు ఉంది.

లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చి.. పోలింగ్ పూర్తైన పదిరోజుల పాటు పాలన విషయాల మీద పెద్దగా ద్రష్టి పెట్టని సీఎం రేవంత్ ఒక్కసారిగా వేగవంతం అయ్యారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయన పాలన మీద ఫోకస్ పెంచారు. అందుకు తగ్గట్లే శనివారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన ఆయన.. అక్కడే వివిధ విభాగాలకు చెందిన కీలక అధికారులతో భేటీ అయ్యారు.

డ్రగ్స్ వినియోగంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. సినీ తారలు.. సెలబ్రిటీలు.. పెద్ద స్థానాల్లో ఉన్న వారు ఎవరైనా సరే.. వారిని విడిచి పెట్టొద్దని.. డ్రగ్స్ మాట ఎత్తాలంటే భయపడేలా చేయాలని.. వాటి మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు.. పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో పోలిస్తే మరింత కఠినంగా వ్యవహరించాలన్న ఆయన.. రాష్ట్రంలో గంజాయి.. ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్యలతో పోలిస్తే మరింత యాక్టివ్ గా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేశారు. డ్రగ్స్ పేరు చెబితేనే వణికేలా చర్యలు ఉండాలన్న ఆయన.. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని.. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్న ఆయన.. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని సీరియస్ గా చెప్పారు.

డ్రగ్స్ సరఫరా చేయాలంటే భయపడేలా కఠినంగా ఉండాలన్న ఆయన.. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్న ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. డ్రగ్స్ అనే పదం వినిపిస్తేనే వణికిపోయేలా చర్యలు ఉండాలని.. ఈ అంశంలో ఎవరూ ప్రతిభ చూపినా ప్రోత్సహించాలని.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలంటూ తమ సర్కారు ప్రాధాన్యతను స్పష్టంగా చెప్పేశారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి ఎంత క్లారిటీగా ఉన్నారన్న విషయంపై రివ్యూ అనంతరం అధికారలు మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు.