బాబు వర్సెస్ రేవంత్.. కోల్డ్ వార్...?
కానీ, ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
By: Tupaki Desk | 21 Jun 2024 8:30 AM GMTఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. రాస్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని.. ఆయన చెబుతున్నారు. పరుగులు పెట్టిస్తామని కూడా అంటున్నారు. అయితే.. పోలవరం పూర్తి చేయాల న్నా.. కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించాలన్నా.. లేదా రేపు ప్రత్యేక హోదాను సాధించాలన్నా.. కూడా చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్రంతో కలివిడి అవసరం. ఇక, తెలంగాణ కూడా విభజన చట్టంలోని అంశాలను సాధించాలంటే.. ఏపీ సహకారం కూడా అంతే అవసరం.
కానీ, ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరి మధ్య మాటలు కూడా లేకపోవడం గమనార్హం. దీనికి కారణం.. `గురు-శిష్యుల` సంబంధమేనని అంటున్నారు పరిశీలకులు. ఎలా అంటే.. రేవంత్‌రెడ్డిని చంద్రబాబుకు శిష్యుడిగా పోలు స్తూ.. తెలంగాణ మీడియా కవర్ చేసింది. అయితే.. ఇది ఎన్నికలకు ముందు డ్యామేజీగా మారుతోందని గుర్తించిన రేవంత్‌రెడ్డి.. ఆవెంటనే దీనిని ఖండించారు.
``ఎవడు ఎవరికి గురువు? ఎవడు ఎవనికి శిష్యుడు. ఇద్దరం కొలీగ్స్ అంతే!`` అంటూ తీవ్రంగా వ్యాఖ్యానిం చారు రేవంత్.ఈ వ్యాఖ్యలు ఏపీలోనూ చర్చకు వచ్చాయి. అప్పటి వరకు రేవంత్‌ను మావాడే అంటూ.. చెప్పుకొన్న కొందరు టీడీపీ నాయకులు.. ముఖ్యంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తర్వాత నుంచి రేవంత్ పేరును ప్రస్తావించడం మానేశారు. అంతేకాదు.. ఇటీవల తనను ఆహ్వానిస్తే.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని రేవంత్ చెప్పినా.. ఏపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు.
ఇక, ఏపీ నుంచి చూస్తే.. చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలతో హర్ట్ అయ్యారు. అప్పటి వరకు తమ స్కూల్ నుంచేరేవంత్ వచ్చారని.. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలోనూ బాబు చెప్పారు. కానీ రేవంత్ వ్యాఖ్యలతో ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఇరువురు నాయకుల మధ్య సంబంధాలు పలుచ బడ్డాయి. ఈ ప్రభావం.. రాజకీయంగా ఎలా ఉన్నా.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన హామీలను నెరవేర్చడంలోనూ.. వాటికి సంబంధించి ఉమ్మడి పోరాటం చేయడంలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేయొచ్చు.