కేసీఆర్ – జగన్ ఒక జట్టు... ఏపీ ఎన్నికలపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోనూ, లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోనూ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 29 April 2024 5:46 AM GMTసార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోనూ, లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోనూ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ కూటమి అని చెబుతుండగా.. తెలంగాణలో మాత్రం త్రిముఖ పోటీ తప్పదని అంటున్నారు. ఈ సమయంలో.. ఏపీలో మరోసారి వైసీపీ గెలుస్తుందని, జగన్ సీఎం అవుతారని తమకు సమాచారం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఏపీ రాజకీయాలపై రేవంత్ రెడ్డి స్పందించారు.
అవును.. ఏపీ తెలంగాణాలు రాష్ట్రాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉంటారనేది తెలిసిన విషయమే. దీంతో... రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఏ విషయం జరిగినా.. దానిపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతుంటుంది. ఈ సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. ఈ సందర్భంగా స్పందించిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని మొదలుపెట్టిన రేవంత్... వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభిచిందని చెప్పిన ఆయన... షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెకు ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే తమ ప్రణాళిక అని అన్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే తమ రాజకీయ ప్రణాళిక అని చెప్పిన రేవంత్ రెడ్డి... ఈసారి ఏపీలో అన్ని సీట్లలోనూ పోటీకి దిగినట్లు చెప్పారు. ఈ సమయంలో తమ దృష్టంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే ఉందని వెల్లడించారు.
ఇదే క్రమంలో... ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవబోతున్నట్లు తమకు సమాచారముందని కేసీఆర్, కేటీఆర్ లు చెప్పిన విషయంపైనా స్పందించిన రేవంత్... చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ, ద్వేషంతోనే అలా మాట్లాడినట్లు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా.. .కేసీఆర్, జగన్ ల మధ్య ఒక అవగాహన ముందు నుంచీ ఉన్నదే అని, వారిద్దరూ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు!