Begin typing your search above and press return to search.

వర్గీకరణకు ఒకటి.. కాళేశ్వరంపై ఒకటి.. రేవంత్ కమిటీల మీద కమిటీలు

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దూకుడు చూపుతోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 10:30 PM GMT
వర్గీకరణకు ఒకటి.. కాళేశ్వరంపై ఒకటి.. రేవంత్ కమిటీల మీద కమిటీలు
X

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దూకుడు చూపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంనాటి ఒక్కో అంశాన్ని తవ్వి తీస్తోంది. ఈ క్రమంలో పలు విమర్శలు వచ్చినా వెనక్కుతగ్గడం లేదు. బీఆర్ఎస్ హయాం నాటి ప్రతి అంశాన్నీ సమీక్షించాలని కాకుండా ప్రజలు ప్రభుత్వానికి నష్టం కలిగించిన అంశాలపై ఫైళ్ల దుమ్ము దులపాలని చూస్తోంది. అందుకే ఒకదాని మీద ఒకటి కమిటీలు వేస్తూ పోతోంది.

విద్యుత్తు కొనుగోళ్లపై

కేసీఆర్ ప్రభుత్వం తొలి విడతలోనే విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకుంది. అయితే, దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఛత్తీస్ గఢ్ నుంచి లైన్లు లేకున్నా కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నదనేది ఆరోపణ. ఈ క్రమంలో చాలా నష్టం వాటిల్లిందని.. అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్ జస్టిస్ ను చైర్మన్ గానూ నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు.. ఛత్తీస్ గఢ్ తో అగ్రిమెంట్లలో అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తోంది.

కాళేశ్వరంపై..

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పతనానికి కారణమైనది కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముంగిట అక్టోబరులో జరిగిన ఈ ఘటనతో కేసీఆర్ సర్కారుకు డ్యామేజీ జరిగింది. ఇక రేవంత్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరంపై న్యాయ విచారణ జరిపేందుకు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఏర్పాటు చేసింది. కాగా.. ఈ కమిషన్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులను విచారణ చేస్తోంది.

గద్దర్ అవార్డులపై..

ఇటీవల సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణపై చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీని అమలుకు కూడా కేబినెట్ ఉప కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ రెండు రోజుల కిందట ప్రకటించారు. మరోవైపు కళాకారులకు ప్రభుత్వం తరపున ఇచ్చే నంది అవార్డుల పురస్కారాన్ని పేరు మార్చి ‘గద్దర్ అవార్డ్స్’ కింద ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సినీ పరిశ్రమ నుంచి సరైన స్పందన రాలేదని కూడా రేవంత్ తప్పుబట్టారు. తాజాగా గద్దర్ అవార్డులపై ప్రముఖ సినీ దర్శకుడు బి.నర్సింగరావు సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, సమస్యల పరిష్కారంపై కమిటీలు వేసి సూచనలు పొందడం అనేది మంచి పద్ధతే. అయితే, కమిటీల ఏర్పాటుతో సరిపెట్టకుండా వాటి సూచనలతో పరిష్కారం సాధిస్తేనే సార్థకత.