రేవంత్ కు గుబులు రేపుతున్న భువనగిరి !
భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గా పోటీ చేస్తుండడమే ఈ పరిణామాలకు కారణం.
By: Tupaki Desk | 30 April 2024 5:31 AMఒక్క సీటు. ఒకే ఒక్క సీటు. లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ కు గుబులు రేపుతున్నది. ఆ స్థానంలో ఎలాగైనా గెలవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ సమీక్ష నిర్వహించాడు. ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి గ్యారంటీ అని ప్రతిపాదించాడు. ఇక సీపీఎం పార్టీ నేతలను ఇంటికి పిలిపించుకుని విజ్ఞప్తి చేసినా వారు వెనక్కి తగ్గడం లేదు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గా పోటీ చేస్తుండడమే ఈ పరిణామాలకు కారణం.
భువనగిరి టికెట్ ను కోమటిరెడ్డి కుటుంబం ఆశించింది. ఆఖరు నిమిషం వరకు వారు విశ్వప్రయత్నాలు చేసినా రేవంత్ పట్టుబట్టి తన సన్నిహితుడు చామలకు ఇప్పించుకున్నాడు. దీంతో రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యాడు. దీంతో నా తర్వాత సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే అని ప్రకటించి సంతృప్తి పరిచే ప్రయత్నం చేశాడు. రాజగోపాల్ రెడ్డి ఇంట్లో సమీక్ష పెట్టి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ ప్రతిపాదించాడు. ఆ తర్వాత ఓ బహిరంగ వేదికలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘నాకు ఏదైనా కావాలంటే అడుక్కోనని, లాక్కుంటానని’ చెప్పడం గమనార్హం.
ఇక పార్లమెంట్ ఎన్నికలల్లో మద్దతివ్వాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా సీపీఎం కార్యాలయానికి వెళ్లి వారిని కోరాడు. రేవంత్ రావాలని వారు షరతు పెట్టారు. ఎన్నికల ముందు వచ్చిన రేవంత్ కు ఇప్పుడెందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు.
సీపీఎం నేతలను ఇంటికి పిలిపించుకున్న రేవంత్ కాంగ్రెస్‌తో పొత్తుకు అంగీకరించి అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బేషరతుగా మద్దతిస్తే సీపీఎంకు ఓ ఎమ్మెల్సీ, ఓ జెడ్పీ చైర్మన్‌తోపాటు రెండు కార్పొరేషన్ పదవులను ఇస్తామని ఆశచూపారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, వీరయ్యలు గంటకుపైగా సమావేశమై చర్చలు జరిపారు.
అయితే భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తామని సీపీఎం ప్రకటించి రేవంత్ కు ఝలక్ ఇచ్చింది. రేవంత్ ప్రతిపాదనలు అన్నీ సీపీఎం పక్కన పెట్టడం గమనార్హం. అన్ని రకాలుగా దిగివచ్చినా భువనగిరిలో పట్టు దొరకక పోవడం రేవంత్ ను కలవరపెడుతున్నది.