Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన ‘ఏఎస్’.. ‘పీజీ’?

ఇంత భారీ యాడ్ పుట్టినరోజు సందర్భంగా పబ్లిష్ చేసింది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 11:55 AM IST
హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన ‘ఏఎస్’.. ‘పీజీ’?
X

కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లోనూ.. అత్యున్న పోలీసు అధికారుల్లోనూ.. కింది స్థాయి సిబ్బందితో పాటు.. లక్షలాది మంది వాహనదారులతో పాటు.. సాదాసీదా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా మాట్లాడుకున్న విషయం హైదరాబాద్ లో నెలకొంది. గురువారం ఉదయం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఏఎస్.. పీజీ పేరుతో ఫ్లెక్సీలు.. పోస్టర్లతో పాటు.. ప్రముఖ దినపత్రికలో వచ్చిన జాకెట్ యాడ్ (మొదటి పేజీ మొత్తం) అందరిని ఆకర్షించింది.


ఇంత భారీ యాడ్ పుట్టినరోజు సందర్భంగా పబ్లిష్ చేసింది. అందులో భారీగా పబ్లిష్ అయిన ఫోటోలో ఉన్నది ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిది. అతడి పుట్టిన రోజు సందర్భంగా భారీ యాడ్ ఇచ్చి తనకున్న భక్తిని ప్రదర్శించారు ఏఎస్.. పీజీ. సాధారణంగా ఒక పెద్ద యాడ్ ఇచ్చినంతనే.. దాన్ని ఇచ్చినోల్లు ఎవరన్న ఆసక్తి వ్యక్తమవుతుంది.

అయితే.. ఈ యాడ్ లో పేర్కొన్న ఏఎస్, పీజీ పేర్లు ఫజిల్ గా మారాయి. చివరకు నిఘా వర్గాలకు చెందిన పోలీసులు.. అధికారులు సైతం ఈ రెండు పేర్ల ఫజిల్ ను చేధించే పనిలో పడ్డాయి. కాసేపటికే పీజీ పేరును డీ కోడ్ చేశారు. పల్లపు గోవర్ధన్ రెడ్డిగా తేల్చారు. గతంలో బీజేపీ.. బీఆర్ఎస్ లోనూ ఉన్న ఆయన ఆ మధ్యన కాంగ్రెస్ లోకి చేరాడు.ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి అత్యంత విధేయుడు. నమ్మకస్తుడు.

దీంతో.. తాను ఎంతో అభిమానించి.. ఆరాధించే తిరుపతిరెడ్డి పుట్టిన రోజును గ్రాండ్ గా నిర్వహించాలని తపించిన ఆయన.. మరొకరు కలిసి భారీ యాడ్ తో పాటు.. ఫ్లెక్సీలు.. పోస్టర్లు ఏర్పాటు చేశారు. పీజీ పేరుపై క్లారిటీ వచ్చినప్పటికీ.. ఏఎస్ అన్న పదానికి అర్థం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. చివరకు పలు రకాలుగా ఆరా తీసిన తర్వాత తేలిందేమంటే.. పల్లపు గోవర్ధన్ రెడ్డికి చెందిన కంపెనీగా తేల్చారు. ఏమైనా.. సీఎం సోదరుడి పుట్టిన రోజున చేసిన హడావుడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా హడావుడికి అర్జెంట్ గా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ అంశంపై ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.