Begin typing your search above and press return to search.

రేవంత్ కేబినెట్ విస్తరణ!... తెరపైకి సరికొత్త పేర్లు!

లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే కథనాలు తెరపైకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 May 2024 1:30 PM GMT
రేవంత్  కేబినెట్  విస్తరణ!... తెరపైకి సరికొత్త పేర్లు!
X

లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. మరోపక్క ఇక రాజకీయాలూ, ఎన్నికలూ పూర్తయ్యాయి.. ఇక కేవలం పరిపాలనపైనే దృష్టంతా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ సమయంలో ఒక కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కేబినెట్ విస్తరణ అంశం చర్చకు వచ్చింది!

అవును... తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతకొన్ని రోజులుగా పలువురు ఆశావాహులు నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తుంది. జూలై, ఆగస్టులోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోన్న నేఅథ్యంలో... మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం.. తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రేవంత్ భావించినన్ని లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగలిగితే.. అధిష్టాణం నుంచి గ్రీన్ సిగ్నల్ వెంటనే వచ్చే సూచనలు ఉన్నాయని.. ఫలితంగా.. జూన్ ద్వితీయార్ధంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ఆరుగురికి ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఎవరూ లేరనే సంగతి తెలిసిందే. అయితే... బీఆరెస్స్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ విషయంలో లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవుల పంపకాలు ఉంటాయని చెబుతున్నారు.

ఈ సమయంలో రేవంత్ కేబినెట్ విస్తరణలో వీరికి అవకాశం దక్కే అవకాశం ఉందంటూ కొన్ని పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగ... రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్‌ మోహన్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారని అంటున్నారు. ఇక నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వినోద్, వివేక్‌ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ నెలకొందని చెబుతున్నారు. ఇద్దరూ ఢిల్లీలోని అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో... బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మరి రేవంత్ మనసులో ఏముందనేది వేచి చూడాలి!