రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ పథకం రద్దు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది.
By: Tupaki Desk | 3 Jan 2024 7:44 AM GMTముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం అంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో పలు అవకతవకలు ఉండటంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సమాచారం.
సొంత ఇంటి స్థలం కలిగిన పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం చేసేలా గత కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తెచ్చింది. దీని కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,12,095 మందికి మంజూరు పత్రాలను కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా జారీ చేసింది.
అయితే గృహలక్ష్మి పథకాన్ని తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కలెక్టర్లు జారీ చేసిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహలక్ష్మి పథకం స్థానంలో ‘అభయహస్తం’ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అభయహస్తం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆరు గ్యారెంటీల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అర్హులను ఎంపిక చేసి, నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేసేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గృహలక్ష్మి పథకం కింద ఆయా జిల్లాల కలెక్టర్లు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని నూతన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.