మీడియా మీట్ కాదు.. చిట్ చాట్.. ఇప్పుడిదే ట్రెండ్.. ఆ సీఎందే బాతాఖానీ అంతా
మీట్ ది ప్రెస్.. ప్రెస్ మీట్.. రాజకీయ నాయకులు, అధికారులు తాము విషయాలను చెప్పేందుకు ఎంచుకునే మార్గాలివి.
By: Tupaki Desk | 7 July 2024 12:30 PM GMTమీట్ ది ప్రెస్.. ప్రెస్ మీట్.. రాజకీయ నాయకులు, అధికారులు తాము విషయాలను చెప్పేందుకు ఎంచుకునే మార్గాలివి. పెద్దఎత్తున ప్రజలకు చేరేవేసేందుకు దీనినో వేదికగా చేసుకుంటారు. ఈ రెండూ కాకుంటే మీడియా ఆఫీసులకు వెళ్లి చర్చల్లో పాల్గొంటారు. పత్రికాధిపతులను కలిసి తమ భావాలు, ఉద్దేశాలను వివరిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో మరో ధోరణి నడుస్తోంది. ఇది దాదాపు ప్రెస్ మీట్ లాంటిదే అయినా.. ఆ పేరు పెట్టడం లేదు.
ఢిల్లీ, హైదరాబాద్ లో..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహజంగానే మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటారు. అంతకుముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాను దగ్గరకు రానిచ్చేవారే కాదు. రేవంత్ మాత్రం పెద్దపీట వేస్తున్నారు. జాతీయ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర సీఎంగా ఆయనకు మీడియా అవసరం చాలా ఉంటుంది. మరోవైపు రేవంత్ తన చదువు పూర్తయిన తొలినాళ్లలో మీడియా సంబంధిత రంగంలోనే ఉద్యోగం చేశారు. కాగా, సీఎం అయ్యాక కూడా మీడియాతో స్నేహశీలతను కొనసాగిస్తున్నారు. అయితే, ఆయన ఇటీవలి కాలంలో మీడియా సమావేశాలు కాకుండా.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని తన నివాసమే ఇందుకు వేదిక. ఇక ఢిల్లీకి వెళ్లినా.. రేవంత్ చిట్ చాట్ కు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్ఠానంతో చర్చించేందుకు రేవంత్ ఇటీవల తరచూ ఢిల్లీ వెళ్లారు. అక్కడ తెలంగాణ భవన్ లో ఆయన మీడియా ప్రతినిధుల మధ్యలో కూర్చుని ముచ్చట్లు చెప్పిన తరహాలో చిట్ చాట్ చేశారు.
కిషన్ రెడ్డి, బండి కూడా అదే బాటలో..
తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఇటీవల చిట్ చాట్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శనివారం బండి సంజయ్ ఇలానే మీడియా మిత్రులతో సంభాషించారు. అంతకుముందు కిషన్ రెడ్డి సైతం చిట్ చాట్ చేసేవారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. కాగా, బీఆర్ఎస్ కీలక నేతలు మాత్రం చిట్ చాట్ తరహా సంభాషణకు దూరంగానే ఉంటారు.
బాదరబందీ లేని బాతాఖానీ..
చిట్ చాట్ ను కచ్చితంగా అర్థవంతంగా చెప్పాలంటే బాతాఖానీగా పేర్కొనాలేమో? అయితే, మీడియా సమావేశానికి, దీనికి పెద్దగా తేడా ఏమీ కనిపించదు. కాకపోతే.. నాయకులు మరింత ఫ్రీగా మీడియాతో మాట్లాడుతుంటారు. మీలో ఒకడిని అనే భావన ఇక్కడ కనిపిస్తుంటుంది. పెద్దగా బాదరబందీ లేని బాతాఖానీగా దీనిని అభివర్ణించాలేమో?