బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు... సీట్ల పంపకంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ, బీఆరెస్ ఒక్కటేనని రేవంత్ ఆరోపించారు. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ విధానమని మండిపడ్డారు. బీఆరెస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని రేవంత్ తెలిపారు.
By: Tupaki Desk | 4 Oct 2023 9:33 AM GMTతెలంగాణలో నేడే రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్నట్లుగా ప్రధాన పార్టీల అగ్రనేతలు రాజకీయం చేసేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ వరుస పర్యటనలు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ రాక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలు ఇదే కోవలోకి చెందుతాయి. అయితే, తాజాగా ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటనలో గతంలో తనతో సీఎం కేసీఆర్ పంచుకున్న పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించడం సంచలనంగా మారింది. సహజంగానే రాజకీయంగా దుమారం కూడా రేగింది. తాజాగా దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్- బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోడీ బయటపెట్టారని రేవంత్ వ్యాఖ్యానించారు. 'బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి కాబట్టే...
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ ను గెలిపించేందుకే మోడీ పర్యటనలు'అని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోడీ అపహాస్యం చేశారని, పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. మోడీ- కేసీఆర్ లది ఫెవికాల్ బంధం అని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ , ఐటీ విచారణ చేయడం లేదు.? బీఆరెస్ దోపిడీలో బీజేపీ కి వాటాలు వెళుతున్నాయి కాబట్టి. అందుకే కేసీఆర్ పై మోడీ చర్యలు తీసుకోవడం లేదు.
ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోడీ ఒప్పుకున్నారు. ' అని రేవంత్ వ్యాఖ్యానించారు.మోడీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.
బీజేపీ, బీఆరెస్ ఒక్కటేనని రేవంత్ ఆరోపించారు. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ విధానమని మండిపడ్డారు. బీఆరెస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని రేవంత్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోడీ చెప్పాల్సిందని రేవంత్ పేర్కొన్నారు. బీఆరెస్ కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలని సూచించారు.
అవిభక్త కవలలుగా ఉన్న బీజేపీ-బీఆర్ఎస్‌లకు ఎంఐఎం నేత అసద్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు? 'ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుందో ఆలోచించుకోవాలి. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆరెస్ తో నిలబడుతుందా లేదంటే... బీజేపీ-బీఆరెస్ ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా' అని ప్రశ్నించారు.
కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోడీని ఆయన దర్బారులో సన్మానం చేశారని రేవంత్ మండిపడ్డారు. 'కేసీఆర్ కు నిధులు అంటే దోపిడీ సొమ్ము, నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి.' అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అధిష్టానం నరేంద్రమోడీ అని స్పష్టత వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. బీఆరెస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తో బీఆరెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే తనకు చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు .''9 చోట్ల బీఆరెస్, 7 చోట్ల బీజేపీ , ఎంఐఎం ఒక చోట పోటీ అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్ పై బీజేపీ, బీఆరెస్ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. ' అంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ సంచలన కామెంట్లపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.