Begin typing your search above and press return to search.

శ్రీవారిని దర్శించుకున్న రేవంత్... ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.

By:  Tupaki Desk   |   22 May 2024 5:20 AM GMT
శ్రీవారిని దర్శించుకున్న రేవంత్...  ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం రేవంత్ రెడ్డి తన మనవడు శ్రీనుకి తలనీలాలు చెల్లించుకున్నారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా... సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం.. స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. శ్రీవారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సమయంలో... తెలంగాణ ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు.

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి రేవంత్‌ రెడ్డి మంగళవారమే తిరుపతి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం... రోడ్డు మార్గంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లారు. రాత్రికి రచనా అతిథిగృహంలో బస చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని తెలిపారు. ఇదే సమయంలో... ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.