అసదుద్దీన్ మరో నిజాం: రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ఒవైసీ కుటుంబం హైదరాబాద్ ది కాదని వారు మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి తెలంగాణకు వలస వచ్చారని హాట్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 8 Sep 2023 10:01 AM GMTతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తో చెట్టపట్టాలేసుకోవడానికి సిద్ధమైన ఎంఐఎం పార్టీపై రేవంత్ నేరుగా విమర్శలకు దిగారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆరే గెలుస్తారని అసదుద్దీన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని మరో నిజాంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఒవైసీ కుటుంబం హైదరాబాద్ ది కాదని వారు మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి తెలంగాణకు వలస వచ్చారని హాట్ కామెంట్స్ చేశారు.
శాస్త్రిపురం కొండపై మరో నిజాం (అసదుద్దీన్ ఓవైసీ) నివసిస్తున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తమ నగరం అని తెలిపారు. ఓవైసీ కుటుంబానిది కాదన్నారు. ఓవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి తమ నగరానికి తరలివచ్చిందని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో జరిగిన ర్యాలీలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు మద్దతు ఇవ్వడంపై నిలదీశారు.
హైదరాబాద్ లో రాజకీయంగా కీలకంగా ఉన్న ఎంఐఎం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ క్రమంలో 2014 ఎన్నికలతోపాటు 2018 ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ఎంఐఎం బలంగా ఉన్న స్థానాల్లో కే సీఆర్ స్నేహపూర్వక పోటీకి దిగారు. ఇందులో భాగంగా అత్యంత బలహీన అభ్యర్థులను ఎంఐఎం అభ్యర్థులపై పోటీకి దింపారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీపై రేవంత్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలిచే కేసీఆర్ కు ఈసారి తెలంగాణ ముస్లింలు మద్దతు ఇవ్వరని తెలిపారు. ‘‘మీరు దొంగలకు మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్‌ను ఎన్నుకోవాలని పదే పదే అడుగుతున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. అలాగే నోట్ల రద్దు, జీఎస్‌టీ అనుకూలంగా ఎందుకు మద్దతు ఇచ్చారు’ అని ఓవైసీని ప్రశ్నించారు.
కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించిన›రేవంత్ రెడ్డి.. అసదుద్దీన్ ఓవైసీకి ఇందులో ఎంత వాటా దక్కిందో చెప్పాలన్నారు. తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. వారిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది అని కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు మార్గాన్ని కూడా మంజూరు చేసిందని.. కానీ కేసీఆర్ పనులు పెండింగ్‌లో ఉంచారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
పాతబస్తీలోని పేద ముస్లింలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.