Begin typing your search above and press return to search.

సీఎం అర్హతపై రేవంత్ హాట్ కామెంట్స్... భట్టి ఫ్యాన్స్ హర్ట్!

ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా.. భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండా మోసి నేడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయిలో ఉన్నారని అన్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 6:14 AM GMT
సీఎం అర్హతపై రేవంత్  హాట్  కామెంట్స్...  భట్టి ఫ్యాన్స్  హర్ట్!
X

ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వరుస బహిరంగ సభలతో ప్రచారాల వేడిని పెంచేస్తున్నాయి. ఇందులో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి!

అవును... తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వరుసగా నామినేషన్ లు దాఖలు చేస్తున్నారు. ఈ సమయంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు! ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో మైకందుకున్న రేవంత్ రెడ్డి... భువనగిరి కోట, కాంగ్రెస్‌ కంచుకోట అని ఎన్నోసార్లు ఇక్కడి ప్రజలు నిరూపించారన్నారని చెబుతూ... 3 లక్షల మెజారిటీతో చామలను గెలిపించి ఢిలీకి పంపాలని కోరారు.

ఇదే సమయంలో యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కేంద్ర సర్కార్, కేసీఆర్ గత పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... నాడు ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్‌ లోకి ఎవరికీ ప్రవేశం ఉండేది కాదని చెప్పిన రేవంత్ రెడ్డి.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్‌ కంచెలు కూలాయని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా.. భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండా మోసి నేడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయిలో ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో ఒక ప్రత్యేక సందర్భంలో తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పిన ఆయన.. ఆ పదవిని తాను బాధ్యతగానే చూసినట్లు తెలిపారు. ఇదే క్రమంలో.. తన తర్వాత ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణలో రేవంత్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి అర్హతలు ఉన్న వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందువరుసలో ఉంటారనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. పైగా... ఒకానొక సమయంలో భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారనే చర్చ బలంగా జరిగింది కూడా! అయితే... అనూహ్యంగా తన తర్వాత ఆ అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఉందని రేవంత్ చెప్పడంపై భట్టి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!