భద్రాద్రి రామన్న.. యాదాద్రి నర్సన్న.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ.. ఇన్ని ఒట్లేమిటి రేవంత్ సారూ?
నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 April 2024 11:19 AM GMTభద్రాద్రి రాముడు.. యాదాద్రి నర్సింహ స్వామి.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ.. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు ఇవి.. వీటిలో కొలువైన దేవుళ్లు, దేవతలు అత్యంత శక్తిమంతమైనవారని భక్తుల నమ్మకం. ఏటా మొక్కుల చెల్లింపులు.. కొత్త వాహనాలు కొంటే పూజలు ఈ ఆలయాల్లో సహజం. అయితే, ఇప్పుడు ఈ దేవుళ్ల మీద ‘ఒట్టు’ పెట్టేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసా?
6 గ్యారంటీలతో ఆకట్టుకుని..
నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. వీటిపై ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనే హామీ మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మరో ప్రధాన హామీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రుణ మాఫీ రూ.లక్ష మాత్రేమనని, అదికూడా విడతల వారీగా చేయడంతో వడ్డీలకు సరిపోయిందనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. అలా కాకుండా తాము ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఘంటాపథంగా చెబుతోంది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో ప్రస్తుతం ఇందుకు అవకాశం లేకపోయింది.
ఆగస్టు 15 నాటికి..
అయితే, లోక్ సభ ఎన్నికల కోడ్ జూన్ 4న ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాగా, దీనికోసం ఆయన దేవళ్లుపై ఒట్టు పెడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన సీఎం రేవంత్ భద్రాచలం రాముడి సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అనంతరం భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభలో యాదాద్రి నర్సింహస్వామిపై ఆన అంటూ ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేస్తామని తెలిపారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నానని, పంద్రాగస్టులోగా రుణ మాఫీ చేసి తీరుతామని వెల్లడించారు.
ఒకటే హామీపై పలు సందర్భాల్లో వివిధ దేవుళ్లపై రేవంత్ ఒట్టు వేయడం గమనార్హం. మరి ఆగస్టు 15నాటికి ఈ ఒట్టును ఆయన ఏమేరకు నెరవేరుస్తారో చూద్దాం.