ఓడాక ఆ ఫ్యామిలీలో 4గురి ఘోషే.. చురక పెట్టిన రేవంత్
డైలీ బేసిస్ లో తనపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ కుటుంబంపై మరోసారి చివాట్లు పెట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 27 Feb 2024 4:33 AM GMTడైలీ బేసిస్ లో తనపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ కుటుంబంపై మరోసారి చివాట్లు పెట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ ను ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే 30సీట్లు కూడా వచ్చేవి కావంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. మరోవైపు తాను పాల్గొనే ప్రతి ప్రోగ్రాంలోనూ మాజీ మంత్రి హరీశ్ సైతం సీఎం రేవంత్ పై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. ఇలాంటి వేళ.. తాజాగా సచివాలయంలో సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ కేసీఆర్ కుటుంబంపై విమర్శల్ని సంధించారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఆ కుటుంబంలోని నలుగురి ఘోష మాత్రమే వినిపిస్తోందంటూ చురకలేశారు. వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని నిలిపేశారన్న ఆయన.. కోర్టు కేసుల్ని పరిష్కరించి నియామక పత్రాల్ని తాము అందిస్తున్న విషయాన్ని తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నట్లుగా మండిపడ్డారు.
కుంగిపోయిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చెప్పమంటే చెప్పలేదన్న సీఎం రేవంత్.. అన్నారం పగిలిపోయిన కారణంగా నీళ్లు వ్రథాగా పోతున్న విషయాన్ని తెలిపారు. ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలు తరలించిపోతుంటే బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదన్న ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు విందు ఇచ్చి ఒప్పందాలు చేసుకొని క్రిష్ణా జలాల్ని ఇచ్చారన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దివాలా తీయించారని మండిపడ్డారు.
రూ.7లక్షల కోట్ల అప్పు ఊబిలోకి నెట్టారని.. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన ముఖ్యమంత్రి దేశంలోనే మరెవరూ లేరన్న రేవంత్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితిని కేసీఆర్ కల్పించారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్న ఉద్దేశంతోనే రేషన్ కార్డులకు నిబంధనలు పెడుతున్నట్లు తెలిపారు.
లబ్థిదారుల గుర్తింపు నిరంతరం సాగుతుందని.. కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేసి.. నిరంతరం కొత్త లబ్థిదారుల్ని చేరుస్తామన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా పథకాల్ని వర్తింప చేస్తే కోటీశ్వరులు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటారన్న ముఖ్యమంత్రి.. కొన్నేళ్లుగా వానలు బాగా పడటంతో భూగర్భ జలాలు పెరిగాయని.. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరిగిందన్నారు. ఈ కారణంతోనే వరి ఉత్పత్తి పెరిగిందన్న రేవంత్.. ఇదేమీ కేసీఆర్ గొప్పతనం కాదన్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటం వల్ల ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయాయని.. ఇప్పుడు భూగర్భ జలాల్ని కేసీఆర్ పెంచుతారా? అంటూ రేవంత్ చేసిన ఎద్దేవా ఆసక్తికరంగా మారింది.