టీపీసీసీ చీఫ్-సీఎంగా ఎన్నికలకు.. ఆ సీఎం ఖాతాలో అరుదైన ఘనత
కాంగ్రెస్ పార్టీ అంటేనే మహా సముద్రం.. స్వేచ్ఛ ఎక్కువ. వర్గాలు, కుమ్ములాటలు.. అధిష్ఠానం నిర్ణయాలు.. ఇలా అనేక రకాల అభిప్రాయాల సంగమం
By: Tupaki Desk | 10 April 2024 2:30 PM GMTకాంగ్రెస్ పార్టీ అంటేనే మహా సముద్రం.. స్వేచ్ఛ ఎక్కువ. వర్గాలు, కుమ్ములాటలు.. అధిష్ఠానం నిర్ణయాలు.. ఇలా అనేక రకాల అభిప్రాయాల సంగమం. అలాంటి పార్టీలో సీఎం పదవి దక్కడం అంటే మామూలు మాటలు కాదు. దీనికంటే ముందు పీసీసీ అధ్యక్ష పదవి దక్కడమూ చాలా కష్టమే. అయితే, ఈ రెండింటిని సాధించిన నాయకుడు ఇపుడు అదే ఊపులో ఎన్నికలను ఎదుర్కొంటూ ప్రత్యేకత చాటనున్నారు.
రెండు పదవులు.. జోడెడ్లు
కాంగ్రెస్ లో సీఎం స్థాయికి ఏమాత్రం తగ్గనిది పీసీసీ అధ్యక్ష పదవి. అందుకే ఈ పదవుల్లో ఉన్నవారిని జోడెడ్లు అంటారు. దివంగత సీఎం వైఎస్, సీనియర్ నేత డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో సీఎం-పీసీసీ చీఫ్ పదవుల్లో ఉంటూ రెండుసార్లు కాంగ్రెస్ ను గెలిపించారు. ఇది ఇప్పటికీ చెరగని రికార్డే. అయితే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను అటు సీఎం హోదాలో, ఇటు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నడిపించనున్నారు.
రెండు పగ్గాలు ఒకరి చేతిలో..
సహజంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్, సీఎంగా ఒకరే ఉండరు. పరిస్థితుల రీత్యా తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రెండు బాధ్యతలను చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి టీపీసీసీ చీఫ్ గా ఉంటూ పార్టీని విజయపథంలో నడిపించిన ఆయననే లోక్ సభ ఎన్నికలకూ పార్టీ సారథిగా కొనసాగిస్తోంది అధిష్ఠానం. ఓ విధంగా ఇది రేవంత్ పై పార్టీ పెట్టుకున్న గట్టి నమ్మకానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అంతేకాదు.. బహుశా టీపీసీసీ చీఫ్, సీఎంగా ఉంటూ ఎన్నికలను ఎదుర్కొన్న ఏకైక కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమేనేమో? ఒకవేళ ఉన్నా.. ఒకరిద్దరికే ఇలాంటి రికార్డు ఉండొచ్చు.
ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ
లోక్ సభ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ బాధ్యతలను చూస్తారనేది స్పష్టం. ఇక ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు రావడం ఖాయం. కాగా, రెడ్డి సామాజివర్గం వారు సీఎంగా ఉంటే మరో వర్గం వారికి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వడం కాంగ్రెస్ సంప్రదాయం. మరి ఈసారి దానిని కొనసాగిస్తారా? లేదా అనేది చూడాలి.