కేసీయార్ మీద రేవంత్ రెడ్డి పోటీ...కామారెడ్డిలో కాక రేపే ఫైట్
తన రాజకీయ జీవితం టీడీపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా కేసీయార్ ఫ్యామిలీని ఎదిరిస్తూ అందులో ఎక్కడా అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డికి ఇది నిజంగా అల్టిమేట్ ఫైట్ అనే చెప్పాలి.
By: Tupaki Desk | 7 Nov 2023 4:08 AM GMTమొత్తానికి అనుకున్నదే అయింది. కేసీయార్ మీద పోటీకి సై అంటూ వస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఆయన మీదకు దించేసింది కాంగ్రెస్ హై కమాండ్. కాంగ్రెస్ విడుదల చేసిన మూడవ జాబితాలో రేవంత్ రెడ్డికి కామారెడ్డి సీటుని కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దీంతో కేసీయార్ తో డైరెక్ట్ గా ఢీ కొట్టేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయిపోయారు. తన రాజకీయ జీవితం టీడీపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా కేసీయార్ ఫ్యామిలీని ఎదిరిస్తూ అందులో ఎక్కడా అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డికి ఇది నిజంగా అల్టిమేట్ ఫైట్ అనే చెప్పాలి.
ఇప్పటిదాకా మీడియా ముందు ప్రకటనలు సవాళ్ళు, సభలలో బిగ్ సౌండ్ చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇక యుద్ధ క్షేత్రంలోని నేరుగా దూకేశారు. కేసీయార్ కి తానే అసలు సిసలు ప్రత్యర్ధి అని అంటున్నారు. ఎన్నికల సమరంలో ఇలా ఇద్దరు రాజకీయ ప్రత్యర్ధులు పోటీకి దిగడం అరుదైన విషయం.
కేసీయార్ బీయారెస్ కి ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్. ఇద్దరూ వేరు వేరు చోట్ల పోటీ చేసి తమ పార్టీ తరఫున ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సహజం. కానీ ఆ ఇద్దరే ప్రత్యర్ధులు గా మారి ఎదురు బొదురుగా యుద్ధం సాగించడం అన్నది కీలకమైన పరిణామం.
తెలంగాణా రాజకీయాల్లో ఇది వినూత్నమైన ఘట్టంగానే చూస్తున్నారు. కేసీయార్ కి గజ్వేల్ లో చూస్తే తన ఒకనాటి సహచరుడు ఈటెల రాజేందర్ ప్రత్యర్ధిగా ఉన్నారు. కామారెడ్డిలో చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో రెండు చోట్ల ఊపిరి సలపని పోరే సాగించాల్సి ఉంటుంది.
మొత్తం తెలంగాణా ఎన్నికల బాధ్యతను మోస్తున్న కేసీయార్ కి తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలు కీలకం కావడం మాత్రం విశేషంగా చెప్పుకోవాలి. ఆయన ఎక్కువ సమయం ఇటు వైపు చూపు సారించేలా కాంగ్రెస్ బీజేపీ బిగించేశారా అన్నదే చర్చకు వస్తోంది.
ఇక కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. ఆయన తానే అభ్యర్థి అని భావిస్తున్నారు. అయితే షబ్బీర్ అలీని నిజమాబాద్ అర్బన్ నుంచి పోటీకి దించడం ద్వారా హై కమాండ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అని చెప్పాలి. ఆ విధంగా మైనారిటీలను తమ వైపునకు తిప్పుకుంటూ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి విజయానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేసింది.
ఇలా రేవంత్ రెడ్డి ని కేసీయార్ మీద పోటీకి దించడం ద్వారా కాంగ్రెస్ తగ్గేదేలే అన్న సంకేతాలు పంపింది. రాజకీయాలలో చూస్తే ఏమైనా జరగవచ్చు. ఎవరు ఎపుడు ఎక్కడ ఓటమి పాలు అవుతారో తెలియదు. ఎందుకంటే దివంగత నేత అన్న గారే కల్వకుర్తిలో ఓటమి పాలు అయ్యారు. ఇది రాజకీయం, అంకెల గారడి. ఒక నంబర్ అటు ఇటు అయితే చాలు ఓటమి పలుకరిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టినా కేసీయార్ తో రేవంత్ రెడ్డి ఫైట్ మాత్రం రసతత్తరంగా ఉండబోతోంది కామారెడ్డిలో ఈసారి కాకలు రేపే రాజకీయం సాగనుంది అని చెప్పాల్సి ఉంది.