Begin typing your search above and press return to search.

లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్... రుణమాఫీపై రేవంత్ కీలక నిర్ణయం!

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ అనే అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 July 2024 10:00 AM GMT
లాస్ట్  మినిట్  లో బిగ్  ట్విస్ట్... రుణమాఫీపై రేవంత్  కీలక నిర్ణయం!
X

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ అనే అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో కేసీఆర్ రైతుబంధుకు కౌంటర్ గా ఈ హామీ తీసుకొచ్చారనే కామెంట్లూ నాడు వినిపించాయి. అయితే ఈ హామీ అమలు విషయంలో రేవంత్ సర్కార్ చాలా జాగ్రత్తలు తీసుకుని, ఉన్నంతలో వ్యూహాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

గతంలో బీఆరెస్స్ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పథకం ఉండేది. ఎవరికి ఎన్ని ఎకరాలున్నా.. ఆ భూములు ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్నా, ఐటీ కట్టే స్థాయిలో ఉన్నా, అతడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా కూడా వారి భూములకు రైతు బంధు అందేది అనే విమర్శ విపరీతంగా వినిపించేది. దీనివల్ల ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందనే విమర్శలు బలంగా వినిపించేవి. ఈ సమయంలో రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ హామీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రైతులకు శుభవార్త అందించారు.. రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. ఆగస్టు 15వ తేదీ లోపు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు రుణమాఫీ పూర్తి చేసే వరకూ ఇదే మాట మీద ఉంటానని వెల్లడించారు.

ఇదే సమయంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్న రేవంత్... దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఇలా అధికారులు మార్గదర్శకాలు ప్రకటించిన వాటికి అనుగుణంగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తామని.. రోజుల వ్యవధిలోనే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ జరిగిపోతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రైతు రుణమాఫీ విషయంలో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బిగ్ షాకిచ్చారు. వీరెవరికీ రుణమాఫీ వర్తింపచేయొద్దని నిర్ణయించారు! దీంతో... ఈ నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ నిర్ణయం సహేతుకమైనదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. అయితే... ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ రైతు రుణమాఫీ కోసం 32 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో 10వేల కోట్లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా.. టీజీఐఐసీ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా మరో రూ.10 వేల కోట్లు, రుణాల రూపంలో మరో రూ.10వేల కోట్లను సమకూరుస్తున్నట్లు భావిస్తున్నారని అంటున్నారు!