కేటీఆర్ స్పీడ్ కు రేవంత్ పంచ్.. కేసీఆర్ బుక్ అయ్యారా?
సీఎం రేవంత్ నుంచి ఈ తరహా సమాధానం ఉంటుందని ఊహించిన మాజీ మంత్రి కేటీఆర్ సవాలుకు ప్రతిసవాలును స్వీకరించే దానిపై మాట్లాడలేదు.
By: Tupaki Desk | 25 July 2024 7:27 AM GMTకొన్ని విషయాల్లో మాజీ మంత్రి కేటీఆర్ దూకుడు.. తొందరపాటు పార్టీకి.. పార్టీ అధినేతకు తిప్పలు తీసుకొచ్చేలా మారిందా? అంటే అవునన్న మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన వేసే అడుగుల్లో వ్యూహం మిస్ అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొందరపాటుతో మాట్లాడే మాటలు.. ముంచుకొచ్చే ఇబ్బందిని గుర్తించని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటను అసరాగా చేసుకొని..సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలు ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ ను టార్గెట్ చేసే క్రమంలో ఆయన్ను ఇరుకున పెట్టేందుకు వీలుగా వ్యవహరించిన మాజీ మంత్రి కేటీఆర్ తీరు ఇప్పుడు ఆయనకే ఇబ్బందికరంగా మారింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న అంశంపై జరిగిన చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ను ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి నిధులు కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ తో సహా మంత్రివర్గ సభ్యులంతా ఆమరణ దీక్ష చేయలంటూ సవాలు విసిరారు. వారి దీక్షకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
నిధులు తెచ్చుడో.. కేబినెట్ సచ్చుడోనని వ్యాఖ్యానించిన కేటీఆర్ మాటలకు తోడుగా మరో మాజీ మంత్రి హరీశ్ రావు కలుగజేసుకొని.. ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా రియాక్టు అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు తాను సిద్ధమన్న సీఎం రేవంత్.. ‘‘చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని మేమెప్పుడు అబద్ధాలు చెప్పలేదు. రూ.100 పెట్టి పెట్రోల్ కొన్నారు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనలేదని చెప్పలేదు. జంతర్ మంతర్ వద్దకు కేసీఆర్ ను రమ్మనండి. ప్రతిపక్షనాయకుడి హోదాలో ఆయన.. శాసన సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో.. అవసరమైతే సచ్చుడో తేలుద్దాం’’ అంటూ ప్రతి సవాలు విసిరారు.
సీఎం రేవంత్ నుంచి ఈ తరహా సమాధానం ఉంటుందని ఊహించిన మాజీ మంత్రి కేటీఆర్ సవాలుకు ప్రతిసవాలును స్వీకరించే దానిపై మాట్లాడలేదు. కామ్ గా ఉండిపోయారు. ఇదంతా చూసిన వాళ్లు.. అనటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు? అన్న మాటతో పాటు.. రేవంత్ ను ఇరుకున పెట్టాలని కేటీఆర్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ రివర్సులో ఆయనే ఇబ్బందికి గురవుతున్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ కాస్తంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఇలాంటి భంగపాట్లు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.