రేవంత్ సంచలనం: నా కోసం ట్రాఫిక్ అపొద్దు.. ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దు
ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన నిర్ణయాల్ని తీసుకుంటూ వెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
By: Tupaki Desk | 16 Dec 2023 2:00 AM GMTఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన నిర్ణయాల్ని తీసుకుంటూ వెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండే రాజమహాల్ లాంటి ప్రగతి భవన్ అలియాస్ ప్రజాభవన్ ను వద్దని.. ఇప్పటి వరకు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. పోలీసు శాఖను రివ్యూ చేసిన రేవంత్.. తాజాగా కీలక ఆదేశాల్ని జారీ చేశారు.
తన కారణంగా ట్రాఫిక్ అపొద్దని.. తాను మిగిలిన వారి మాదిరి ప్రయాణిస్తానని వెల్లడించటం సంచలనంగా మారింది. అంతేకాదు.. తన కాన్వాయ్ లో ఉండే 15 వాహనాల్ని 9 వాహనాలకు కుదించాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. అవసరానికి మించిన హడావుడి అక్కర్లేదన్నట్లుగా రేవంత్ నిర్ణయాలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తాను బయలుదేరటానికి చాలా ముందే ట్రాఫిక్ నిలిపివేయొద్దన్న రేవంత్.. పోలీసుల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. మినహాయింపులు కల్పించే విషయంలోనూ ఆలోచనలు చేయాలని పోలీసు ఉన్నతాధికారుల్ని కోరారు. తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జాం.. ట్రాఫిక్ నిలిపివేతలు చేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవటం కోసం తాను పెద్ద ఎత్తున పర్యటనలు చేయాల్సిన అవసరం ఉందన్న రేవంత్.. తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీసు అధికారుల్ని కోరారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవటం తనకు సాధ్యం కాదన్న రేవంత్.. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించే దిశగా కసరత్తు షురూ చేస్తున్నట్లు చెబుతున్నారు.