Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్.. ‘ఢిల్లీ మిఠాయ్’.. ఎవరికి ఏం స్వీటు దక్కునో?

తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండిపోయింది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 5:30 PM GMT
సీఎం రేవంత్.. ‘ఢిల్లీ మిఠాయ్’.. ఎవరికి ఏం స్వీటు దక్కునో?
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిపోయింది. ఇంకా నామినేటెడ్ పదవులు చాలావరకు భర్తీ కాలేదు.. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయ్.. అసెంబ్లీలో చీఫ్ విప్ ను ఖరారు చేయాల్సి ఉంది.. టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో తేలాల్సి ఉంది.. కొత్తగా మంత్రి పదవుల్లో అనూహ్య ఎంపికలు... స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహం.. ఇలా ఎన్నో అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్యలో లోక్ సభ ఎన్నికలు రావడంతో కొత్తగా చేసేందుకు ఏమీ లేకపోయింది. ఇకమీదట నాలుగేళ్ల నాలుగు నెలల్లో ప్రభుత్వం అంటే ఏమిటో చూపాల్సి ఉంది.

పదేళ్లు వెయిటింగ్..

తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండిపోయింది. ఈ వ్యవధిలో పెద్ద నాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చెల్లాచెదురయ్యారు. మిగిలిన కొద్ది మందితోనే గత ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున పదేళ్లుగా పదవులకు దూరమైన కేడర్ ను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ముందుగా చేపట్టాల్సినది నామినేటెడ్ పదవుల పందేరం. ఇప్పటికే ఓ 40-50 నామినేటెడ్ పదవులు ఇచ్చినా.. ఇంకా చాలావరకు మిగిలి ఉన్నాయి.

టీపీసీసీ సామాజిక సమతౌల్యం..

తెలంగాణ పీసీసీ చీఫ్ గా మూడేళ్లు దాదాపు బాధ్యతలు నిర్వర్తించిన రేవంత్ పార్టీని అధికారంలోకి తెచ్చి న్యాయం చేశారు. ఇప్పుడు ఆయన సీఎంగా పూర్తిగా ప్రభుత్వంపై ఫోకస్ పెట్టాల్సి ఉన్నందున టీపీసీసీ చీఫ్ గా మరొకరిని తప్పనిసరిగా నియమించాల్సి ఉంది. రేవంత్ స్థానంలో టీపీసీసీ చీఫ్ గా వచ్చే నాయకుడు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నందున ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవి చాలా కీలకం కానుంది.

ప్రభుత్వంలోనూ ఖాళీలు..

తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. క్యాబినెట్ లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్ కు ఇంతవరకు మంత్రి లేరు. వీటిలోకి వచ్చేదెవరు? అనేది చూడాలి. కాగా, అసెంబ్లీలో సీఎంకు సహాయకారి అయిన, సభా వ్యవహారాల్లో కీలకంగా నిలిచే చీఫ్ విప్ పదవిని భర్తీ చేయలేదు. కాగా, ఈ పదవుల మూట విప్పేందుకే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ చేస్తున్నారు. అక్కడినుంచి వస్తూనే ‘ఢిల్లీ’ తేనున్నారు. దీంతో ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఏం శుభవార్త తెస్తారా? అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.