Begin typing your search above and press return to search.

ఒట్టేసి చెబుతున్నా

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది.

By:  Tupaki Desk   |   25 April 2024 5:28 AM GMT
ఒట్టేసి చెబుతున్నా
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాను నన్ను నమ్మండి అంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న దేవుళ్ల మీద, చర్చిల మీద వేస్తున్న ఒట్లు చర్చానీయాంశంగా మారాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబరు 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఫించన్లు రెట్టింపు, మహిళలకు నెలకు రూ.2500 సాయం, వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ వంటి అనేక హామీలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. మహిళలకు ఉచిత బస్సు, పరిమిత సంఖ్యలో ఉచిత విద్యుత్ మినహాయిస్తే మిగిలిన గ్యారంటీలన్నీ కాంగ్రెస్ మూలకు పడేసింది. 100 రోజులలో హామీల అమలు అంటూ గడువు కోరిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని చెబుతూ వస్తున్నది.

అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయపోవడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలలో గణనీయమైన ఫలితాలు రాకుంటే ముఖ్యమంత్రి పదవికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న మహబూబా బాద్ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి భద్రాద్రి రాముడి సాక్షిగా ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం, రూ.500 బోనస్ తో వడ్లు కొంటాం నన్ను నమ్మండి. కాంగ్రెస్ ను 14 స్థానాలలో గెలిపించండి అని వేడుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 20న మెదక్ పర్యటనలో మెదక్ చర్చ్, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, ఈ నెల 21న భువనగిరిలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద, ఈ నెల 24న వరంగల్ లో మేడారం సమ్మక్క, సారాలమ్మ, రామప్ప, వేయిస్థంభాల గుడి సాక్షిగా ప్రమాణాల మీద ప్రమాణాలు చేస్తున్నాడు.

‘‘నిజంగా హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే రేవంత్ తన ఇంట్లో ఉన్న వాళ్ల మీద ఒట్లు వేయాలని, దేవుళ్ల మీద ఎందుకు ఒట్లు వేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని’’ బీజేపీ మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి డీకె అరుణ ప్రశ్నించారు. మరి రేవంత్ ఒట్లను జనం ఎంతవరకు నమ్ముతారు ? ఎంత మందిని గెలిపిస్తారు ? అన్నది వేచిచూడాలి.