మేడారంలో సీఎం రేవంత్ డ్రీం ప్రాజెక్టు
మేడారంలో వనదేవతల స్మ్రతివనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.
By: Tupaki Desk | 11 Jun 2024 4:16 AM GMTయావత్ తెలంగాణ ప్రజలు భావోద్వేగంతో ఇట్టే కనెక్టు అయ్యే అంశాల్లో ఒకటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలపాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన డ్రీం ప్రాజెక్టుల్లో ఒకటైన ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చారు. మేడారంలో వనదేవతల స్మ్రతివనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.
ఇందుకోసం గద్దెల వెనుకున్న 25 ఎకరాల స్థలంలో స్మ్రతి వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వనంలో తల్లుల జాతర విశేషాలతో పాటు అప్పటి వస్తువులు.. శాసనాలు.. వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు చిలకల గుట్టను సుందరీకరించటంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు చేస్తుననారు.
దీనికి సంబంధించిన డీపీఆర్ ను అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ములుగు జిల్లాలోని మేడారంలో రెడేళ్లకు ఒకసారి జాతరను నిర్వహించటం తెలిసిందే. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతర కోసం కోట్లాది మంది తరలి రావటం తెలిసిందే. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర నాలుగు రోజుల పాటు జరగటం సంప్రదాయం.
ఇందుకోసం పది రాష్ట్రాల నుంచి కోటికిపైగా భక్తులు హాజరవుతారు. దేశంలో కుంభమేళా తర్వాత అంతటి స్థాయి కార్యక్రమం దీన్నేనని చెప్పాలి. ఈ స్మ్రతి వనంతో రేవంత్ సర్కారు నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నారు. ఇన్ని ప్రభుత్వాలు చేయని పనిని రేవంత్ చేయటం ద్వారా పాలనలో తన మార్కు చూపించాలని భావిస్తున్నారు.