Begin typing your search above and press return to search.

ఏపీకి ఏమీ ఇవ్వరు.. తెలంగాణకు ఇవ్వాలా? ఇదేం న్యాయం?

అందులో ఒకటి.. హైదరాబాద్ మహానగరంలో కొన్ని భవనాలు ఏపీకి కేటాయించాలని అడిగితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ససేమిరా అన్నారు.

By:  Tupaki Desk   |   30 July 2024 4:45 AM GMT
ఏపీకి ఏమీ ఇవ్వరు.. తెలంగాణకు ఇవ్వాలా? ఇదేం న్యాయం?
X

అడిగే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లుగా వ్యవహరిస్తుంటారు తెలంగాణ ఎమ్మెల్యేలు. విడిపోయి కలిసి ఉందామన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఎలుగెత్తటం.. ఉద్యమాన్ని నడపటం.. కోరుకున్నట్లే తెలంగాణను సాధించుకోవటం తెలిసిందే. ఇదంతా జరిగిపోయి కూడా పదేళ్లు దాటేశాయి. పదేళ్లు దాటిన తర్వాత కూడా ఏపీ నుంచి అది కావాలి.. ఇది కావాలని కోరుకోవటమే కానీ.. మాది ఇది ఇస్తాం.. మీది మాకు కాస్తంత ఇస్తారా? అన్న మాట కాకుండా.. మాకిది కావాలంతే అన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ నేతలు.. పాలకుల తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

మొన్నటికి మొన్న ఏపీ సర్కారు రెండు అంశాలకు సంబంధించి తమ పట్ల కాస్తంత సానుకూలంగా స్పందించాలని కోరింది. అందులో ఒకటి.. హైదరాబాద్ మహానగరంలో కొన్ని భవనాలు ఏపీకి కేటాయించాలని అడిగితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ససేమిరా అన్నారు. అంతేనా.. భూముల కోసం అప్లికేషన్ పెట్టుకోండి.. వరుస క్రమంలో మీ సంగతి చూస్తామంటూ మోహమాటం లేకుండా అనేశారు.

రెండో విషయానికి వస్తే.. తెలంగాణలోని తెలుగు వర్సిటీ మాదిరి ఏపీలో లేని నేపథ్యంలో.. ఈ విద్యా సంవత్సరం సదరు వర్సిటీలో ఆడ్మిషన్లు ఏపీకి కేటాయించాలని కోరితే ససేమిరా అనటమే కాదు.. కుదరదు పొమ్మని చెప్పేశారు మోహమాటం లేకుండా. అలాంటిది.. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ వద్దకువెళ్లిన తెలంగాణ ఎమ్మెల్యేలు.. తిరుపతిలో తమ సిఫార్సు లేఖలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరటం చూస్తే.. సిత్రంగా అనిపించక మానదు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు.

తమ నియోజకవర్గాల నుంచి నిత్యం వందలాది మంది భక్తులు తిరుపతికి వెళుతున్నారని.. వసతి కోసం అవస్థలు పడుతున్నారని.. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల్ని అక్కడి అధికారులు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్న వారు.. తమ లేఖల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్.. తాను ఏపీ ముఖ్యమంత్రితోనూ.. ఏపీ ప్రభుత్వంతోనూ చర్చిస్తానని.. త్వరలోనే ఏదో ఒకటి చేద్దామన్న హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఏపీకి ఇచ్చేందుకు చేతులు రాని తెలంగాణ ప్రభుత్వం.. అదే ఏపీ నుంచి మాత్రం తాము కోరుకున్నవన్నీ తీసుకోవాలన్ని ఆలోచనకు ఏమనాలి? ఎలా చూడాలి?