ఎన్నికల వేళ రేవంత్ తప్పుల మీద తప్పులు
తాజాగా చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. బీఆర్ఎస్ కు ఒక్కసీటు కూడా రాదన్న మాటను ఆయన బలంగా చెబుతున్నారు. రెండు చోట్ల రెండో స్థానంలో ఉంటారని.. మిగిలిన వాటిల్లో మూడో స్థానంలో నిలిచారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 April 2024 9:30 AM GMTకొన్నిసార్లు అంతే. అప్పటివరకు ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేసేటోళ్లు సైతం.. ఒక్కసారిగా తప్పటడుగులు వేస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పరిమితమన్న నిజాన్ని ఒప్పుకోవాలి. అయితే.. ఈ విషయంపై ఇటీవల కాలంలో సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు.. రానున్న రోజుల్లో ఆయనకు కష్టాల్ని తీసుకొస్తాయంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ వరకు చూసుకుంటే బీజేపీకి ఐదుస్థానాలు ఖాయంగా వస్తాయని.. మరో రెండు ఎక్కువగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ నిజాన్ని కాంగ్రెస్ నేతలు సైతం ప్రైవేటు సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. కానీ.. సీఎం రేవంత్ మాత్రం మీడియాతో మాట్లాడే వేళలోనూ.. తన ప్రసంగాల్లోనూ తానున క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు చెప్పుకోవటం కనిపిస్తోంది. అంతేకాదు.. బీజేపీకి.. బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నది ఆయన మర్చిపోతున్నారు.
ఎందుకంటే.. ఎన్నికలు వస్తాయి. పోతాయి. కానీ.. ఎన్నికల వేళలో చేసిన వ్యాఖ్యలు రికార్డుల రూపంలో అలా నిలిచిపోతాయి. రాజకీయ జోస్యాలు చెప్పేటప్పుడు.. అంచనాల గురించి అభిప్రాయాల్ని పంచుకునేటప్పుడు వాస్తవిక ధోరణిలో ఉండాలే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు తప్పవన్నది మర్చిపోకూడదు. తాజాగా చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. బీఆర్ఎస్ కు ఒక్కసీటు కూడా రాదన్న మాటను ఆయన బలంగా చెబుతున్నారు. రెండు చోట్ల రెండో స్థానంలో ఉంటారని.. మిగిలిన వాటిల్లో మూడో స్థానంలో నిలిచారని చెబుతున్నారు.
ఇందులో నిజం కొంతేనని.. వాస్తవం వేరుగా ఉంటుందని చెబుతున్నారు. బీజేపీకి వచ్చే సీట్ల విషయంలో రేవంత్ చెబుతున్న లెక్కలు తప్పే అవకాశం ఉందంటున్నారు. కీలకమైన ముఖ్యమంత్రిస్థానంలో ఉండి.. మంచి మాటకారిగా పేరున్న రేవంత్.. ఎన్నికల వేళ పార్టీల గెలుపు మీద మాట్లాడేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఎన్నికల తర్వాత కొత్త తలనొప్పులతో పాటు.. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ రేపొద్దున రిఫరెన్సుగా చేసుకొని విమర్శలు సంధిస్తే.. సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అందుకే.. ఎన్నికల ఫలితాల అంచనాలు చెప్పేటప్పుడు కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.