తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ను ఫైనల్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డీజీపీ నియామకంపై ఒక స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 10 July 2024 5:48 AM GMTతెలంగాణకు కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డీజీపీ నియామకంపై ఒక స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని.. ఈ రోజు (బుధవారం) అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని చెబుతున్నారు. నిజానికి ఈ ఉత్తర్వులు మంగళవారం విడుదల కావాల్సి ఉండగా.. ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా టూర్ లో ఉన్న కారణంగా వాయిదా పడింది.
కొత్త డీజీపీగా ఐపీఎస్ అధికారి జితేందర్ గా ముఖ్యమంత్రి రేవంత్ డిసైడ్ చేశారు. దీంతో..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితులవుతున్న మొదటి డీజీపీ ఆయనే కానున్నారు. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన.. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయన ఉమ్మడి ఏపీ క్యాడర్ కింద తెలుగు రాష్ట్రంలోనే పని చేశారు. విభజన సమయంలో ఆయన తెలంగాణ క్యాడర్ కు రావటం.. తాజాగా రాష్ట్రానికి పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆయన.. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. తర్వాత బెల్లంపల్లి ఎస్పీగా పని చేవారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్.. గుంటూరు జిల్లాల ఎస్పీగా వ్యవహరించిన ఆయన.. తర్వాత ఢిల్లీలో సీబీఐకు వెళ్లారు. 2004-2006లో గ్రేహౌండ్స్ లో పని చేసిన ఆయన డీఐజీగా ప్రమోట్ అయ్యారు. ఆ సమయంలో విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పని చేసిన ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పని చేశారు.
ఏపీలో సీఐడీ.. ఎంక్వయిరీ కమిషన్.. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్ లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగంలో అదనపు డీజీపీగా.. జైళ్ల శాఖ డీజీగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
2025 సెప్టెంబరులో రిటైర్ కానున్న ఆయన.. తాజాగా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ డీజీగాదాదాపు పద్నాలుగు నెలల పాటు పని చేసే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న రవిగుప్తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఎన్నికల కమిషన్ ఆయన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళలో తెలంగాణ డీజీపీగా వ్యవహరించిన అంజనీ కుమార్.. ఓట్ల లెక్కింపు సమయంలో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తున్న వేళలోనే ఆయన రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేయటం అప్పట్లో సంచలనంగా మారింది.
దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యల వేటు వేశారు. క్రమశిక్షణ చర్య కింద ఆయన్ను సస్పెండ్ చేసి.. రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఆయనే డీజీపీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాత్రం జితేందర్ ను డీజీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ మొగ్గు చూపటం.. అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం జరిగింది. అధికారికంగా ఉత్తర్వులు విడుదల కావటమే మిగిలి ఉంది.