ఈసారి సెక్రటేరియట్ నిర్మాణంపై దృష్టి పెట్టిన రేవంత్!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రతీ విషయంపైనా.. గత పదేళ్లలో జరిగిన దాదాపు ప్రతీ విషయంపైనా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Jan 2024 8:46 AM GMTతెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రతీ విషయంపైనా.. గత పదేళ్లలో జరిగిన దాదాపు ప్రతీ విషయంపైనా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాన్సంట్రేషన్ పెంచిన రేవంత్ రెడ్డి... తాజాగా విద్యుత్తు కొనుగోళ్లపైనా దృష్టి సారించారు. ప్రతి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపైనా పక్కాగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సెక్రటేరియట్ నిర్మాణంపైనా దృష్టిపెట్టారని తెలుస్తుంది!
అవును... కేసీఆర్ సర్కార్ నిర్మించిన సెక్రటేరియట్ భవనం వ్యయంపైన రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సెక్రటేరియట్ నిర్మించిన కాంట్రాక్టు సంస్ధ ప్రతినిధులతో పాటు ఫైనాన్స్ ఉన్నతాధికారులతోనూ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ భవనం నిర్మాణానికి సంబంధించి ఖర్చుచేసిన ప్రతీ పైసాపైనా రేవంత్ లెక్కలు, వివరణ కోరుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా... సెక్రటేరియట్ నిర్మాణానికి మొదట్లో వేసిన అంచనా వ్యయం ఎంత? అనంతర కాలంలో పెరిగిన అంచనా వ్యయం ఎంత? అనే విషయాల దగ్గరనుంచి బిల్డింగ్ డిజైన్, ఫర్నిచర్, ఎలక్ట్రిక్ సామాన్ల కొనుగోళ్లు, మంత్రుల చాంబర్స్ లో ఉన్న వ్యత్యాసాలతోపాటు మరిన్ని సూక్షమైన విషయాలపైన కూడా సీఎం ఆరా తీస్తున్నారని అంటున్నారు. ఈమేరకు తనకు నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి డిటైల్స్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఈ సందర్భంగా అప్పటికి తమవద్ద ఉన్న ప్రాధమిక సమాచారన్ని అధికారులు సీఎంకు అందించారని అంటున్నారు. ఇందులో భాగంగా... పనులు మొదలైనపుడు అంచనా వ్యయం రు.617 కోట్లుగా ఉండగా.. తర్వాత వ్యయం రు. 1150 కోట్లకు చేరినట్లు చెప్పారట. అయితే అంచనా వ్యయం పెంచుకునేందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు చూపించమని అడిగితే అధికారులు నీళ్లు నమిలారని తెలుస్తుంది.
ఇదే సమయంలో 200 కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఫర్నీచర్ కూడా అత్యంత నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ నిర్మాణంపై చాలా విమర్శలు వచ్చాయి. ఇందులో భాగంగా... వర్షాకాలం లోపలకు వచ్చిన నీటిని బకెట్లతో తోడుతున్నారనే కామెంట్లూ వినిపించాయి. అయితే నాడు సెక్రటేరియట్ లోకి మీడియాకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు! ఈ సమయంలో రేవంత్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది.
కాగా... మే 1 - 2023 న నూతన సచివాలయానికి వెళ్లేందుకు నాడు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి బయలుదేరగా... సెక్రటేరియట్ సమీపంలోని టెలిఫోన్ భవన్ ప్రాంతంలోనే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఒక ఎంపీనని.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓ.ఆర్.ఆర్.) టెండర్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వివరాలు తెలుసుకునేందుకు.. హెచ్.ఎం.డీ.ఏ. ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నానని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే... అనుమతి లేకుండా ఎవ్వరినీ లోపలికి పంపిచొద్దని పైనుంచి ఆదేశాలున్నాయని పోలీసులు నాడు రేవంత్ కు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.
అనంతరం రేవంత్ భీష్మించుకుని కూర్చోవడంతో.. ఆయన వెళ్లాల్సిన డిపార్ట్మెంట్ కొత్త సెక్రటేరియట్ భవనంలో లేదని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ భవన్ కు రేవంత్ రెడ్డిని తరలించారు. కట్ చేస్తే... ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో.. అసలు ఆ భవనం నిర్మాణం అంచనా వ్యయం, క్వాలిటీ, పెరిగిన వ్యయం, ఫర్నిచర్ మొదలు అన్ని విషయాలపైనా ఆరా మొదలుపెట్టారని తెలుస్తుంది