Begin typing your search above and press return to search.

రేవంత్ మార్క్.. ఇంజినీరింగ్ కాలేజీలకు వన్ టైం సెటిల్ మెంట్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరిలా ఆలోచించేలా ఉంటే ఈ కథనం రాయాల్సిన అవసరం ఉండేది కాదు

By:  Tupaki Desk   |   14 July 2024 7:30 AM GMT
రేవంత్ మార్క్.. ఇంజినీరింగ్ కాలేజీలకు వన్ టైం సెటిల్ మెంట్ ఆఫర్
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరిలా ఆలోచించేలా ఉంటే ఈ కథనం రాయాల్సిన అవసరం ఉండేది కాదు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొత్త తరహాలోఉందన్న మాట వినిపిస్తోంది. సాధారణంగా ఆర్థిక సంస్థల నుంచి వ్యక్తులు.. కొన్ని కంపెనీలు తాము తీసుకున్న రుణాల్ని తీర్చలేకపోవటం.. వన్ టైం సెటిల్ మెంట్ కింద సెటిల్ చేసుకోవటం కనిపిస్తుంది. మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను బకాయిలు ఉన్న మొత్తాన్ని వన్ టైం సెటిల్ మెంట్ చేసుకునేందుకు ముందుకు రావటం.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ప్రస్తావించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద వందలాది కోట్లు రూపాయిలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు బకాయిలు పడటం తెలిసిందే. ఇప్పుడా భారాన్ని మోయటం రేవంత్ సర్కారుకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇలాంటి వేళ.. ఆసక్తికరమైన ప్రపోజల్ ను తెర మీదకు తీసుకొచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ఉన్న బకాయిల్ని సెటిల్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పిన రేవంత్.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన ఫీజి రీయింబర్స్ మెంట్ బకాయిల్ని క్లియర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. అయితే ఇప్పటికే ఉన్న బకాయిలకు సంబంధించిన ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఒకసారి ఆలోచించి.. సెటిల్ మెంట్ అమౌంట్ కింద ఇష్యూ క్లోజ్ చేస్తానని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. ఈ పద్దతి కాస్త కష్టమే అయినప్పటికి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో.. ఈ ఏడాది నుంచి అమలు చేసే ఫీజు రీయింబర్స్ మెంట్ ను సకాలంలో చెల్లిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు పెట్టమన్న విషయాన్ని రేవంత్ స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరి కాకుండా ఈ ఏడాది నుంచి తాము ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన నిధుల్ని సకాలంలో చెల్లిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి వచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ కు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఎలా రియాక్టు అవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఉద్యోగాల నియామకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి నియామకాలు చేపడతామని.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ క్యాలెండర్ కు చట్టబద్ధత చేపడతామన్న ఆయన.. ఏ పరీక్షలూ రాయని వాళ్లు పరీక్షల్ని వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మూడు ఉదాహరణలు చెప్పటం గమనార్హం. పరీక్షను రెండు నెలలు ప్రభుత్వం వాయిదా వేస్తే ఒక కోచింగ్ సెంటరే ఏకంగా రూ.వంద కోట్ల బిజినెస్ చేస్తుందన్న విషయాన్ని తనకు చెప్పారన్న రేవంత్ మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.