Begin typing your search above and press return to search.

రేవంత్ అర్జునుడా? అభిమన్యుడా?

సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేతిలో ఉన్న కర్రతోనో.. రాయితోనో దాన్ని టార్గెట్ చేస్తే.. తొలుత ఇబ్బందికి గురయ్యేది.. తేనెతుట్టను టార్గెట్ చేసినోడే

By:  Tupaki Desk   |   27 Aug 2024 4:12 AM GMT
రేవంత్ అర్జునుడా? అభిమన్యుడా?
X

తేనె తుట్టను కదిలించటం ఆషామాషీ వ్యవహారం కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేతిలో ఉన్న కర్రతోనో.. రాయితోనో దాన్ని టార్గెట్ చేస్తే.. తొలుత ఇబ్బందికి గురయ్యేది.. తేనెతుట్టను టార్గెట్ చేసినోడే. ఈ చిన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ అయ్యారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ కు ముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ ను తీసుకుంటే.. ఆయన పదేళ్ల పాలనలోనూ.. దానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులు తొందరపడని ఒక అంశం మీద రేవంత్ దూసుకెళ్లిపోవటం.. బుల్డోజర్ల తరహాలో వ్యవహరిస్తున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

అక్రమార్కుల అక్రమాల విషయంలో వేలు పెట్టటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకుంటే.. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర కల్పించుకోవాల్సిందే. కానీ.. దానికి అవసరమైన ఆయుధాల్ని సిద్ధం చేసుకొనే రేవంత్ హైడ్రాను రంగంలోకి దించారా? అన్నది అసలు ప్రశ్న. చెరువుల్ని కాపాడటమే తమ ధ్యేయంగా.. చెరువు ఆయుకట్టలను సంరక్షించటమే లక్ష్యంగా హైడ్రా అనే వ్యవస్థను తెర మీదకు తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా.. అక్రమ కట్టడాల్ని నిర్దిరించటం.. ఆ వెంటనే కొట్టేయటం లాంటి అంశాల్లో న్యాయపరమైన చర్యల్ని సైతం హైడ్రానే తీసుకోవటం.. వెనుకా ముందు చూసుకోకుండా విరుచుకుపడటం ఇప్పటివరకు చూస్తున్నాం.

ఇక్కడే పెద్ద తలనొప్పి ఉంది. చెరువుల ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ లకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అనుమతి లేని నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా.. కొన్ని వ్యవస్థలు (అది హెచ్ ఎండీఏ కావొచ్చు జీహెచ్ఎంసీ కావొచ్చు) అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్మించిన వాటిపైనా విరుచుకుపడటం ప్రశ్నగా మారింది. ఒకరు చేసిన తప్పునకు వేరే వారు ఎందుకు బలి కావాలి? అన్నది ఇక్కడ ప్రాథమిక ప్రశ్న. ఒక వ్యవస్థకు చెందిన ఒక విభాగం ఇచ్చిన అధికారిక అనుమతుల్ని అసరాగా చేసుకొని నిర్మాణం చేసినప్పుడు.. ఇప్పుడు అదే వ్యవస్థకు చెందిన మరో విభాగం వచ్చి మీరు చేసింది తప్పు అంటూ.. కూల్చేసేందుకు అవసరమైన తీర్పును ఇన్ స్టెంట్ గా ఇచ్చేయటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

సంపన్నులైనా.. సామాన్యులైనా ఒకే తీరును ప్రదర్శిస్తామని చెబుతున్న హైడ్రాను నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన తీసుకొచ్చిన హైడ్రాను కురుక్షేత్ర యుద్ధంగా పేర్కొంటూ.. అందులో పోరాటం చేస్తున్న రేవంత్ ను కొందరు అర్జునుడిగా పోలుస్తుంటే.. మరికొందరు అభిమన్యుడిగా వ్యవహరిస్తున్నారు. కురుక్షేత్రంలో పద్మ వ్యూహాన్ని చేధించే శక్తి ఉన్న ఈ ఇద్దరిలో.. అభిమన్యుడికి వెళ్లటం వరకు తెలుసు. తిరిగి రావటం తెలీదు. అదే సమయంలో అర్జునుడికి రెండు తెలిసినా.. వెళ్లి వచ్చే వరకు వెళ్లరు.

ఇక్కడ రేవంత్ వెళ్లటం వరకైతే వెళ్లిపోయారు. ఆ తర్వాతేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అంశాన్ని సీపీఎం నారాయణ తనదైన శైలిలో చెబుతూ.. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పులిస్వారీ మొదలు చేశారని.. దాన్ని కొనసాగిస్తారో.. లేదన్నది ఆయనపైనే ఉంటుందని చెబుతున్నారు. స్వారీ ఆపకుంటే పులికి ఆహారం కావాల్సి ఉంటుందని.. కొనసాగింపు అంత తేలికైనది కాదన్న వాదనను వినిపిస్తున్నారు. సమాజంలో అత్యంత బలవంతులతో యుద్ధానికి దిగే విషయంలో వెనుకా ముందు ఆడకుండా నిర్ణయం తీసుకోవటం వరకు సరే.

కానీ.. అలా తీసుకునే ముందు న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా అవసరమైన ప్లానింగ్ ఎంతమేర ఉందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే రేవంత్ పై కొత్త సందేహాలు వ్యక్తం చేసేలా మారాయి. ఆ భావనే ఆయన్ను కొందరు అభిమన్యుడిలా పోలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన్ను అర్జునుడిగా పోలుస్తూ..వీరతాళ్లు వేస్తున్నాయి. ఇప్పుడేం జరుగుతుందన్నది కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.