Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇమేజ్ ను మొత్తంగా దెబ్బ తీసిన హైడ్రా

తాను చెప్పే మాటలకు తగ్గట్లే చేతల్లో చేసి చూపిస్తున్న వైనం రేవంత్ కు సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతోంది.

By:  Tupaki Desk   |   20 Aug 2024 4:17 AM GMT
కేసీఆర్ ఇమేజ్ ను మొత్తంగా దెబ్బ తీసిన హైడ్రా
X

మాటలు కాదు కేవలం యాక్షన్ అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? దశాబ్దాల తరబడి అక్రమ నిర్మాణాలతో చెరువులు.. కుంటలు.. అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి దానిని కబ్జా చేసేసే కబ్జాగాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హైదరాబాద్ మహానగరంలో.. ఇప్పుడు అలాంటి వారి లెక్కలు తేల్చేలా హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చిన రేవంత్ సర్కారు.. అక్రమార్కులకు చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్ మహానగర నీటి వనరులుగా ఉండాల్సిన చెరువుల్ని కబ్జా చేసేసి.. వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన వైనంపై గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి దమ్ము.. ధైర్యం సరిపోలేదు. అందుకు భిన్నంగా రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన ఎనిమిది నెలల్లోనే తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయటమే కాదు.. ఊహించని సన్నివేశాలతో తన సత్తా చాటుతున్న రేవంత్.. సమ్ థింగ్ స్పెషల్ గా మారారు.

తాను చెప్పే మాటలకు తగ్గట్లే చేతల్లో చేసి చూపిస్తున్న వైనం రేవంత్ కు సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతోంది. హైడ్రా అనే వ్యవస్థను తెర మీదకు తీసుకురావటమే కాదు.. పేపర్ పులిగా కాకుండా అసలుసిసలు పులి అన్న రీతిలో వ్యవహరిస్తూ.. అక్రమ నిర్మాణాల్ని తుక్కుతుక్కుగా కొట్టేస్తున్న వైనం సంచలనంగా మారింది. హైడ్రా పని తీరుతో గులాబీ బాస్ కేసీఆర్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిందని చెబుతున్నారు. వేలాది పుస్తకాలు చదివిని మేధావిగా తనను తాను చెప్పుకునే కేసీఆర్.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో హైదరాబాద్ మహానగరం మీద రివ్యూ చేయటాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది.

వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ.. ప్రభుత్వ భూముల్ని.. స్థలాల్ని.. పార్కుల్ని.. రోడ్లను.. నాలాల్ని.. చెరువుల్ని.. కుంటల్ని ఇలా అన్నింటిని కబ్జా చేసేశారని.. వర్షం పడితే చాలు నగరం ఆగమాగం అవుతుందని.. అలాంటి వారి అంతు చూసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందంటూ ఒక గంట పాటు విలేకరుల సమావేశంలో ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేసిన కేసీఆర్.. తన పదేళ్ల పాలనలో హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని కించిత్ మార్చింది లేదు. మాటలే తప్పించి చేతలు లేకపోవటం ఒక ఎత్తు.. పదేళ్ల పాలనలో మహానగరంలోని పలు చెరువుల్ని కబ్జా చేసేసి భారీ నిర్మాణాలు చేపట్టిన దుస్థితి నెలకొంది. అయినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.

ఇదిలా ఉంటే.. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కబ్జాగాళ్లకు చుక్కలు చూపించే సరికొత్త వ్యవస్థను హైడ్రా పేరుతో ఏర్పాటు చేయటమే కాదు.. కబ్జాగాళ్ల భరతం పట్టేందుకు గత ప్రభుత్వాలు ఎక్కడైతే తప్పులు చేశాయో.. వాటి లెక్కల్ని సరి చేసేలా వ్యవహరిస్తున్నారు. పెద్ద మాటల హడావుడి లేకుండా.. చేతల్లో ఇంతలా చేస్తున్న రేవంత్ సర్కారు తీరుతో కేసీఆర్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.