ఇపుడు అదే విషయాన్ని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు
ఇపుడు అదే విషయాన్ని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు.
By: Tupaki Desk | 11 Jun 2024 3:00 AM GMTప్రభుత్వ పాఠశాలలు అంటే కొందరికి చిన్న చూపు ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు చాలా మంది ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఇపుడు అదే విషయాన్ని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఆయన ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. తాను అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అందరమూ ప్రభుత్వ బడులలో చదువుకున్న వాళ్ళమే అంటూ రేవంత్ చెప్పిన ఈ మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ముగ్గురూ మూడు రాజకీయ పార్టీలకు చెందిన వారు. అయినా రేవంత్ ఎలాంతి భేషజం లేకుండా పెద్దలు ఇద్దరినీ కలుపుతూ చేసిన ఈ కామెంట్స్ తో అంతా ఆయన వ్యవహార శైలిని మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణా సర్కారీ బడులను బాగు చేసేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే కృషి చేస్తున్నారు.
మొత్తం విద్యా రంగాన్ని స్ట్రీం లైన్ చేయడానికి ఆయన చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో వసతులు సమకూరాలని ఆయన కోరుతున్నారు. తనను ప్రతీ రోజూ చాలా మంది సివిల్ సర్వెంట్స్ ఇతర అధికారులు కలుస్తూ ఉంటారని వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలలోనే చదువుకున్నారు అని రేవంత్ చెప్పుకొచ్చారు.
అంతే కాదు దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నేతలు ప్రభుత్వ బడులలో చదివినవారే అంటూ ఆయన మోడీ బాబులను ఉదహరించారు. తెలంగాణాలో విద్యా శాఖలో కొత్త సంస్కరణలు తీసుకుని వస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కొన్ని చోట్ల తక్కువమంది టీచర్లు ఎక్కువ మంది విద్యార్ధులు ఉంటే మరి కొన్ని చోట్ల తక్కువ మంది విద్యార్ధులు ఉన్నారని ఆయన తెలంగాణా విద్యా వ్యవస్థ గురించి పేర్కొన్నారు. తెలంగాణాలో విద్యా వ్యవస్థ కుప్ప కూలింది అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సబ్జెక్టులను కొంత మంది టీచర్లే బోధిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్లు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలకు గత వైభవం తీసుకుని వస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలు ఏజెన్సీలలో ఉన్న వారికి ప్రభుత్వ విద్యను అందిస్తామని ఆయన అంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి విద్యా రంగం మీద తనదైన విజన్ తో ముందుకు సాగుతున్నారు.