Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ విలీనం .. నాన్నా పులి కథేనా ?!

పరోక్షంగా రేవంత్ కు బీజేపీ, బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నాడు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తున్నది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 5:30 PM GMT
బీఆర్ఎస్ విలీనం .. నాన్నా పులి కథేనా ?!
X

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీ అధిష్టానం చెప్పినట్లు బీఆర్ఎస్ నడుచుకుంటుంది అన్నది కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో, ఇటీవల లోక్ సభ ఎన్నికల సమయంలో వాదిస్తూ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి. అందుకే ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను నిలిపాడు. పరోక్షంగా రేవంత్ కు బీజేపీ, బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నాడు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తున్నది.

ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, ఆర్ టీవీ అధినేత రవిప్రకాష్ తన ఆర్ టీవీ లో త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నది అంటూ ఒక వార్త ప్రచారం చేశాడు. దానికి ముందు బిగ్ టీవీలోనూ ఇలాంటి వార్తలనే ప్రసారం చేశారు. ఆ తర్వాత అదే కథనాన్ని కొంత మంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు అందుకున్నారు.

కానీ బీజేపీ నుండి మాత్రం ఏ ఒక్క నేతా ఈ వార్తలపై స్పందించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. అసత్య వార్తలు ప్రసారం చేసిన ఆర్ టీవీ ఛానల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఆర్ టీవీ ‘ఎక్స్’ ఖాతాను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం గమనార్హం.

అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందన్నది ఎంత వరకు నిజం ? దానికి ఎంత వరకు అవకాశాలు ఉన్నాయి ? అన్న చర్చ మొదలయింది. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలలో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో 10 మంది పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడంతో ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి అన్న ప్రయత్నాలు ఫలించలేదు. 28 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం అన్నది అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి దాదాపు రూ.600 కోట్ల పైచిలుకు నిధులతో పాటు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు, పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఈ పరిస్థితులలో విలీనం అవుతుంది అన్న ప్రచారం కేవలం పక్కదారి పట్టించడం మాత్రమేనని, ఇలాంటి నాన్నా పులి కథల ప్రసారం మూలంగా మీడియా విశ్వసనీయత కోల్పోతుందని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.