బొక్క పెట్టిండు : జగన్ ని హీరో చేస్తున్న రేవంత్ రెడ్డి...!
సరైన సమయంలో జగన్ కి పొరుగు రాష్ట్రం నుంచి తిట్ల రూపంలో అయినా కితాబులు లభిస్తున్నాయి
By: Tupaki Desk | 9 Feb 2024 1:01 PM GMTసరైన సమయంలో జగన్ కి పొరుగు రాష్ట్రం నుంచి తిట్ల రూపంలో అయినా కితాబులు లభిస్తున్నాయి. తెలంగాణాలో తిడుతున్నారు అంటే ఏపీ మేలు కోసం పనిచేస్తున్నట్లే లెక్క. కేసీఆర్ తో జగన్ ప్రభుత్వం కుమ్మక్కు అయి ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను మొత్తం తాకట్టు పెట్టేసిందన్నది ఏపీలోని ప్రతిపక్షాల విమర్శ.
అయితే దానికి భిన్నంగా తెలంగాణాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మీద విమర్శలు సంధిస్తోంది. తెలంగాణా ప్రయోజనాలను జగన్ కి కేసీఆర్ తాకట్టు పెట్టేశారు అని ఇప్పటికి చాలా సార్లు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవలనే ఆయన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఏపీ పోలీసులను ఎలా పెడతారు. ఇదంతా కేసీఆర్ చేతగాని తనం వల్లనే అని మండిపడ్డారు.
ఇపుడు తాను సీఎం గా ఉన్నాను చేయమను చూద్దామని కూడా రేవంత్ సవాల్ చేశారు. ఇది ఒక విధంగా ఏపీ సీఎం జగన్ కి ప్లస్ పాయింట్ గానే ఉంది ఎందుకంటే ఏపీ ప్రయోజనాల కోసం రాజీ పడని ధోరణితో జగన్ వెళ్తున్నారు అనేది ఏకంగా అక్కడ అధికార పక్షమే చెబుతోంది కాబట్టి.
ఇక ఇది చాలదు అన్నట్లుగా తాజాగా తెలంగాణా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా జగన్ వైపు నుంచి చూస్తే వరంగా మారుతునాయి. కేసీఆర్ తన ఇంటికి జగన్ ని పిలిచి పంచభక్ష్య పరమాన్నాలు పెడితే ఆయన ఏకంగా బొక్క పెట్టారు అని నిందించారు శ్రీశైలం నుంచి రోజుకు ఏపీ ప్రభుత్వం 12.50 నుంచి 13 టీఎంసీల నీరు తరలించే ప్రయత్నం చేస్తోంది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం అలా తమ రాష్ట్రం కోసం చేసుకుని పోతూంతే తెలంగాణాకు కనీసం రోజుకు రెండు టీఎంసీల నీరు కూడా తరలించే ప్రాజెక్ట్ లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. నెల రోజుల పాటు తెలంగాణా ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అని రేవంత్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేసారు.
కేసీఆర్ పిలిచి మరీ జగన్ కి పెద పీట వేస్తే ఆయన ఏకంగా తెలంగాణా ప్రయోజనాలకే బొక్క పెట్టారు అని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తమకు కావాల్సిన నీరు అంతా తరలించుకుని పోతూంటే కేసీఆర్ సీఎం గా ఉండి ఏమి చేశారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఆయన కేసీఆర్ అసమర్థ ప్రభుత్వాన్ని నిందించే క్రమంలో చేస్తున్న విమర్శలు ఏపీ సీఎం జగన్ కే ప్లస్ అవుతున్నాయని అంటున్నారు. ఎన్నికల వేళ ఇలా రేవంత్ రెడ్డి అనుకోని విధంగా జగన్ ని ఏపీలో హీరో చేస్తున్నారు అని అంటున్నారు. క్రిష్ణా ప్రాజెక్టుల మీద తెలంగాణా సీఎం చేసిన కామెంట్స్ తో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుతోంది అన్నది మరో యాంగిల్ లో చెప్పకనే చెప్పినట్లు అయింది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే రేవంత్ వర్సెస్ కేసేఅర్ వార్ లో జగన్ ని తీసుకుని వస్తున్నారు. కేసీఆర్ తో మంచిగా ఉంటూ ఏపీ ప్రయోజనాలను జగన్ కాపాడుకుంటున్నారు అన్నది కూడా ఏపీ జనాలకు అర్ధం అయ్యేలా రేవంత్ చెప్పేసినట్లు అయింది. సో కేసీఆర్ బదనాం అవడం వేరే సంగతి కానీ ఇక్కడ జగన్ మాత్రం బాగానే మార్కులు కొట్టేస్తున్నారు అని అంటున్నారు.