Begin typing your search above and press return to search.

గీతం రాసిన అందెశ్రీ డిసైడ్ చేస్తే తప్పా? దొరలు చేస్తే రైటా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన షురూ చేసిన రోజు నుంచి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వేలెత్తి చూపటం

By:  Tupaki Desk   |   29 May 2024 7:30 AM GMT
గీతం రాసిన అందెశ్రీ డిసైడ్ చేస్తే తప్పా? దొరలు చేస్తే రైటా?
X

గడిలో కూర్చొని తాము డిసైడ్ చేసింది మాత్రమే జరిగేలా వ్యవస్థల్ని శాసించిన తీరులానే ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని భావించిన గులాబీ బ్యాచ్ కు తాజాగా మరో దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన షురూ చేసిన రోజు నుంచి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వేలెత్తి చూపటం.. తప్పులు ఎత్తి చూపాలని తపించటం.. అందుకోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. అడ్డంగా బుక్ కావటం గులాబీ బ్యాచ్ కు అలవాటుగా మారింది. తమకున్న కుబుద్దితో రేవంత్ ను బుక్ చేద్దామనుకున్న ప్రతిసారీ.. రివర్సులో పింకీలకు పంచ్ పడుతున్న వైనం ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పదేళ్ల తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతాన్ని.. రాష్ట్ర రాజముద్రతో సహా పలు అంశాల్ని మార్చాలని నిర్ణయించటం తెలిసిందే. అది సరైనదా? కాదా? అన్నది ఒక ప్రశ్న. ప్రతి పాలకుడికి ఒక విజన్ ఉంటుంది. దానికి తగ్గట్లే వారి నిర్ణయాలు ఉంటాయి. ఉద్యమ సమయంలో అందరిని కలుపుకుపోవాలని మాటలు చెప్పి.. అందరిని ఒక చోటకు చేర్చిన ఆయన.. చివరకు తెలంగాణ వచ్చి.. అధికారం తన చేతిలోకి వచ్చిన తర్వాత తాను.. తన కుటుంబం మాత్రమే తప్పించి మిగిలిన వారెవరు? అంటూ వ్యవహరించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అంతేకాదు.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయం తనది మాత్రమే ఉండాలన్నట్లుగా వ్యవహరించిన అహంకారపూరిత విధానంపై తెలంగాణ సమాజం ఎంతటి ఆగ్రహంతో ఉందో తెలిసిందే. అలాంటప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రజల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవటం తప్పేం కాదు కదా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అదే పని చేశారని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీలను కుదిర్చే పనిని గేయ రచయిత అందెశ్రీకి అప్పజెప్పటం.. కీరవాణి చేత బాణీలు కట్టించే ప్రయత్నం చేయటంపై రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కీరవాణి ప్రతిభ కంటే కూడా ఆయన నేపథ్యంలోని ఆంధ్రానే కొందరిని వేదనకు గురి చేస్తోంది. అదే సమయంలో ఏళ్లకు ఏళ్లుగా హైదరాబాద్ లోనే స్థిరపడిపోయి.. ఆయన ఇల్లు వాకిలి ఇక్కడే ఉండిపోయాయని.. తాను సంపాదించే సంపాదనలో అత్యధికం ఇక్కడే ఖర్చు చేస్తున్న విషయాన్ని మర్చిపోతున్నారు.

బాణీలు కట్టేందుకు కీరవాణిని ఎంపిక చేయటంపై ముఖ్యమంత్రి రేవంత్ ను తప్పు పట్టినోళ్లు లేకపోలేదు. అలాంటి వాదనల్ని వినిపించేందుకు కాస్తంత సమయం ఇచ్చిన రేవంత్.. తాజాగా తన మాటతో అందరి నోళ్లు మూయించేశారు. రాష్ట్ర గీతాన్ని సిద్దం చేయాలని తలపోసిన ముఖ్యమంత్రి రేవంత్ ఆ బాధ్యతను గీత రచయిత అందెశ్రీకిఅప్పజెప్పి.. మీకు నచ్చిన విధంగా సిద్ధం చేయాలని కోరారు. ఆయన కీరవాణిని సంప్రదించి.. సాయం చేయమని అడిగారు. ఇందులో రేవంత్ జోక్యం ఏముంది? ఇదే విషయాన్ని తాజాగా రేవంత్ వెల్లడించి.. ఇరుకు మనస్తత్వంతో మాట్లాడి.. రాజకీయంగా ఇబ్బంది పెడదామని ప్రయత్నించిన వారికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

తెలంగాణ గీతానికి కీరవాణి బాణీలు కట్టే అంశంపై భావోద్వేగాన్ని రగిల్చి.. దాంతో రాజకీయ లబ్థి కోసం ప్లాన్ చేసిన పలువురికి సీఎం రేవంత్ సమాధానం నోరెళ్ల బెట్టేలా చేసింది. తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీనే కీరవాణిని ఎంపిక చేసుకున్నారని.. ఈ విషయంలో తన జోక్యం ఏమీ లేదని.. ఆయనకు ఆ స్వేచ్ఛను ఇచ్చినట్లు చెప్పారు. దీంతో.. రేవంత్ చెప్పే ప్రజాప్రభుత్వ భావన ఎంత నిజమన్న విషయం ఆయన మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపితమైందని చెప్పాలి. చిల్లర రాజకీయాల్ని చేద్దామనుకునేటోళ్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లైంది.